
సాక్షి, అమరావతి: ఏపీ శాసనసభ సమావేశాలు నవంబర్ పదో తేదీ నుంచి జరగనున్నాయి. ఎనిమిదో తేదీ నుంచి సమావేశాలు జరపాలని మొదట భావించినా మంచిరోజు కాదనే ఉద్దే శంతో తేదీని మార్చినట్లు తెలిసింది. పదో తేదీ నుంచి 10 పనిదినాల పాటు ఈ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత ఐదు రోజులే సమావేశాలు జరపాలని అధికా రపక్షం భావించింది.
అయితే, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర తలపెట్టిన నేపథ్యంలో సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశం ఉండకపోవచ్చనే అంచనాతో మరో ఐదు రోజులు పొడిగించాలని పాలకపక్ష ముఖ్యులు దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశాల్లోనే బాలికా సంరక్షణ, బాలికల సమస్యలకు సంబంధించి ప్రత్యేకంగా ఒకరోజు ఎమ్మెల్యేలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పదిరోజుల పాటు సమావేశాలు జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది.