
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, సాధించిందేమీ లేకుండానే ప్రగతి నివేదన సభ నిర్వహిస్తుండటం హాస్యాస్పదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. శనివారం మఖ్దూంభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకిచ్చిన హామీల అమలులో వైఫల్యంపై సభ నిర్వహిస్తే బాగుంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించలేదని, పథకంలో అక్రమార్కుల ఏరివేత గాలికొదిలేశారని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పత్తా లేవని, ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి ఖర్చు అరకొరగానే ఉందన్నారు.
నీటి పారుదల ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తికాలేదని, వ్యయాన్ని రెట్టింపు చేస్తూ జేబులు నింపుకుంటున్నారన్నారు. ఉద్యోగాల ఊసే లేదని, నిరుద్యోగులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు, అక్టోబర్ 1 నుంచి 10వరకు మోదీ హటావో–దేశ్ బచావో, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామ న్నారు. అక్టోబర్ 10న భద్రాద్రి కొత్తగూడెంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.