
పార్లమెంటులో ప్రతిష్టాత్మకమైన పదవి స్పీకర్ పదవి. పార్లమెంటు మొత్తానికీ స్పీకర్ అత్యున్నతాధికారి. అధికారంలో ఉన్న పార్టీ అభీష్టానికి అనుగుణంగా సీనియర్ లోక్‌సభ సభ్యులను స్పీకర్ పదవికి ఎంపిక చేస్తారు. గత పదహారు లోక్‌సభల్లో ఒక్కరు మినహా మిగిలినవారెవ్వరినీ రెండోసారి స్పీకర్ పదవి వరించిన పరిస్థితి మన దేశంలో లేదు. గత రెండు దశాబ్దాల్లో అయితే స్పీకర్ గా ఉన్న ఏ ఒక్కరూ లోక్‌సభకు తిరిగి ఎన్నికవలేదు. గత 16 లోక్‌సభల్లో ఒకసారి స్పీకర్‌గా పనిచేసిన వారిలో కేవలం 10 మంది మాత్రమే తిరిగి లోక్‌సభకి ఎన్నికయ్యారు. మొత్తం 16 లోక్‌సభల్లో నీలం సంజీవరెడ్డిని మాత్రమే రెండు సార్లు స్పీకర్ పదవి వరించింది. ఒకసారి స్పీకర్‌గా పనిచేసినవారిలో తిరిగిపోటీ చేసిన కొందరు ఎన్నికల్లో ఓడిపోవడం, కొందరు అసలు పోటీయే చేయకపోవడం, మరికొందరికి పార్టీ తిరిగి సీటు ఇవ్వకపోవడం దీనికి కారణమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
2014లో పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా స్పీకర్ పదవికి ఎంపికైన ప్రస్తుత స్పీకర్ సుమిత్రా మహాజన్ కి సీటు కేటాయించలేదు. ఇండోర్ నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడంతో తాను అసలు పోటీయే చేయనని సుమిత్రా మహాజన్ తాజాగా ప్రకటించారు. 67 ఏళ్ళ లోక్‌సభ చరిత్రలో సుమిత్రా మహాజన్ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ద్వితీయ మహిళ. సుమిత్రా మహాజన్‌కన్నా ముందున్న స్పీకర్ మీరా కుమార్ తొలి మహిళా స్పీకరే కాకుండా తొలి దళిత మహిళా స్పీకర్‌గా కూడా రికార్డుకెక్కారు.
మీరా కుమార్ కన్నా ముందు తొలి కమ్యూనిస్టు దిగ్గజం అయిన సోమనాథ్ ఛటర్జీ సీపీఎం నుంచి లోక్‌సభ స్పీకర్ పదవిని అలంకరించారు. అయితే ఛటర్జీ కష్టాలు కూడా అదే లోక్‌సభలో ప్రారంభం అయ్యాయి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా వామపక్ష పార్టీలన్నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని నిర్ణయించినప్పుడు స్పీకర్‌గా రాజీనామా చేసి, లోక్‌సభ సభ్యుడిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశించింది. అయితే సోమనాథ్ ఛటర్జీ మార్క్సిస్టు పార్టీ నిర్ణయాన్ని తోసిపుచ్చి స్పీకర్ పదవి హుందాతనాన్ని కాపాడారు. అంతేకాకుండా తాను ఆపై ఎన్నికల్లో పోటీ చేయనని కూడా స్పష్టం చేశారు. పార్టీ బహిష్కరణ తరువాత కమ్యూనిస్టు దిగ్గజం ఛటర్జీ రాజకీయ ప్రస్థానాన్ని అర్థంతరంగా ముగించాల్సి వచ్చింది.
శివసేన వ్యవస్థాపకుల్లో ఒకరు, శివసేన అధినాయకుడు బాల్ థాకరే అతి సన్నిహితుడూ అయిన మనోహర్ జోషీ సోమనాథ్ ఛటర్జీకన్నా ముందు లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు. స్పీకర్ పదవిని చేపట్టడానికన్నా ముందు మనోహర్ జోషీ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి మనోహర్‌జోషీ గెలిచారు. అయితే జీఎంసీ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో హఠాత్తుగా మరణించడంతో మనోహర్ జోషీని స్పీకర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జోషీ అసెంబ్లీలో సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తే కాకుండా శివసేన సీనియర్ నాయకుడు కూడా కావడంతో ఆయనను స్పీకర్ పదవి వరించింది. ఆ తరువాత 2004 ఎన్నికల్లో జోషీ ఓడిపోవడంతో ఆయన తిరిగి లోక్‌సభలో అడుగుపెట్టలేదు. భారత చట్టసభల తొలి స్పీకర్ జీఎస్. మాల్వంకర్ 1952లో ఎన్నికయ్యారు. 1956లో ఆయన మరణించారు. ఇక ఎమర్జెన్సీ అనంతరం జరిగిన 1977 ఎన్నికల తరువాత తొలి లోక్‌సభకు కేఎస్.హెగ్డే స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈయన కూడా తిరిగి రెండోసారి లోక్‌సభకు ఎన్నిక కాలేదు.