
కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీచార్జ్‌ను ఖండించిన పార్టీ చీఫ్..
సాక్షి, న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో పోలీసులు లాఠీచార్జ్‌లో ఏడుగురు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడిన ఘటన నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. లాఠీచార్జ్ ఘటనను తీవ్రంగా ఖండించిన రాహుల్ మోదీ హయాంలో నియంతృత్వం ఓ వృత్తిలా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. బిలాస్‌పూర్‌లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రాథమిక హక్కులపై రమణ్ సింగ్ సర్కార్ సాగించిన దమనకాండ రాజకీయ వేధింపులేనని స్పష్టమైందన్నారు.
కాగా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టణాభివృద్ధిమంత్రి అమర్ అగర్వాల్ నివాసం లోపల చెత్తను విసిరివేశారని, ఫలితంగా వీరిపై లాఠీచార్జి చేసి చెదరగొట్టామని పోలీసులు చెబుతుండగా, కాంగ్రెస్ నేతలు మాత్రం అగర్వాల్ నివాసం ఎదుట శాంతియుత నిరసనలు తెలుపుతున్న తమ కార్యకర్తలను పోలీసులు దారుణంగా కొట్టారని ఆరోపిస్తున్నారు. విపక్ష పార్టీని కచరా (చెత్త)గా అభివర్ణించిన మంత్రికి నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. నిరసనల నేపథ్యంలో 52 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు.