
టీజీ భరత్, ఎస్వీ మోహన్ రెడ్డి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో నేరుగా తేల్చుకునేందుకు టీజీ భరత్ సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రజల వద్దకు వెళ్లేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. విజన్ యాత్ర పేరుతో 33 వార్డుల పర్యటనకు తెరలేపారు. వచ్చే నెల 9 లేదా 27వ తేదీన ఈ యాత్రను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు 2019 ఎన్నికల ఎజెండా కూడా ప్రకటిస్తానని ఆయన అంటున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీలో ఉంటానని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఎస్వీ, టీజీ మధ్య పోరు మరింత ఆసక్తికరంగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వార్డుల వారీగా ఎమ్మెల్యే ఎస్వీ పర్యటిస్తున్నారు. ఇదే సందర్భంలో టీజీ భరత్ కూడా వార్డు పర్యటనల ద్వారాతన అనుచరులను కట్టడి చేయడంతో పాటు బలాన్ని ప్రదర్శించేందుకు కూడా దోహదపడుతుందనేది ఆయన అభిప్రాయంగా ఉంది.
వచ్చే నెలలో...
వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని టీజీ భరత్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. నేరుగా సీఎం చంద్రబాబు బరిలో ఉంటే తప్ప తనను పోటీ నుంచి ఎవ్వరూ తప్పించలేరని కుండబద్దలు కొడుతున్నారు. మరోవైపు కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఎస్వీ మోహన్‌రెడ్డి పోటీ చేస్తారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, సీట్లను ప్రకటించేందుకు లోకేష్ ఎవరంటూ భరత్ తండ్రి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మండిపడ్డారు. టీజీ వ్యాఖ్యలపై అధికార పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేకపోగా.. కనీసం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసేందుకు కూడా పార్టీ ముందుకు రాలేదు. పత్తికొండ నియోజకవర్గంలో ఏకంగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి వ్యతిరేకంగా తుగ్గలి నాగేంద్ర పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టిపై మండిపడటం తప్ప కేఈ ఏమీ చేయలేకపోయారు. ఇదే తరుణంలో కర్నూలు నగరంలోనూ ఎమ్మెల్యే ఎస్వీకి పోటీగా టీజీ భరత్ అదే పార్టీ కండువా కప్పుకుని పర్యటిస్తే అడ్డుచెప్పే అవకాశం లేదన్నది వీరి అభిప్రాయంగా ఉన్నట్టు తెలుస్తోంది. వార్డుల వారీగా సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఎమ్మెల్యే వైఖరిని కూడా ఆయన ఎండగట్టే అవకాశముంది. ఇదే జరిగితే ఇరువర్గాల మధ్య పోటీ మరింత ముదిరే సూచనలు కన్పిస్తున్నాయి.