
అమిత్ క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని...
కోల్‌కత్తా : బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బెంగాల్ సంస్కృతిని హేళన చేసి మాట్లాడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తమపై చేసిన అసత్య ఆరోపణలకు 72 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీఎంసీ హెచ్చరించింది. శనివారం అమిత్ షా కోల్‌కత్తాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమిత్ షా మాయో రోడ్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. తన పర్యటనను అడ్డుకునేందుకు టీఎంసీ నేతలు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారని, తన ప్రసంగాన్ని టీవీల్లో ప్రసారం కాకుండా అడ్డుకున్నారని అమిత్ ఆరోపించారు.
అమిత్ షా ఆరోపణలను టీఎంసీ కొట్టిపారేసింది. దీనిపై టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ మాట్లాడుతూ.. అమిత్ షా పర్యటనను ప్లాప్ షోగా వర్ణించారు. తన పర్యటన విఫలం కావడం మూలంగానే తమ నేతలపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీవీలను బ్లాక్ చేయాల్సిన అవసరం తమకు లేదని, అమిత్ షాకు బెంగాల్ సంస్కృతి తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తమపై చేసిన ఆరోపణలకు 72 గంటల్లో క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.