
సాక్షి, తిరుపతి: సినీ నటుడు పవన్ కల్యాణ్‌ది జనసేన కాదని, కేవలం భజన సేన అని ఇటీవల విమర్శించిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. తాజాగా జనసేన అధినేత చేసిన వారసత్వం వ్యాఖ్యలను తప్పుపట్టారు. తిరుపతిలో ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు ఇచ్చిన స్క్రిప్టును చదవటం పవన్ అలవాటు చేసుకున్నాడని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. టీడీపీ నేతల మాటలను పవన్ వేదంలా పాటిస్తున్నారని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబుపై పవన్‌కు ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు.
వారసత్వం గురించి పవన్ చేసిన వ్యాఖ్యల్ని రోజా తిప్పికొట్టారు. వారసత్వం గురించి నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మెగా హీరో చిరంజీవి లేకుంటే అసలు పవన్ సినిమాల్లోకి వచ్చేవాడా? అని రోజా ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి వారసత్వం అనే అంశంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ఏడాదికిగానూ ఆస్తుల వివరాలు వెల్లడించిన నారా లోకేష్.. వేల కోట్ల రూపాయిలు విలువ చేసే ఆస్తులను వందల కోట్ల లోపే చూపించారని.. ఆ వివరాలన్నీ బోగస్ అని ఆమె వ్యాఖ్యానించారు. తప్పుడు లెక్కలు చినబాబుకు అలవాటయ్యాయంటూ నారా లోకేష్‌పై ఎమ్మెల్యే రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.