
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా ఏదైనా పెద్ద కుట్ర జరుగుతోందా? లేక ఏపీ ప్రజల అసంతృప్తిని కప్పిపుచ్చి డైవర్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం చూస్తోందా? వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనను తెలుగుదేశం మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతులు కవర్ చేసిన తీరు చూస్తే ఎవరికైనా ఈ అనుమానాలు రాకమానవు. హోంశాఖ మంత్రి అనిత, టీడీపీ లోక్‌సభ సభ్యుడు లావు కృష్ణదేవరాయళ్ల వ్యాఖ్యలు అనుమానాలను మరింత బలపరిచేవిగా ఉంటున్నాయి.
రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ నేత కురుబ లింగమయ్య బీసీ వర్గపు నేత. ఆ ప్రాంతంలో ఈ వర్గానికి మంచి పట్టే ఉంది. హత్య వెనుక రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గానికి చెందిన కొందరు ఉన్నారన్నది అభియోగం. మొత్తం ఇరవై మందిపై ఫిర్యాదు చేస్తే ఇద్దరిపైనే కేసు పెట్టారట. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్లడానికి సిద్దమైన రోజు నుంచి పరిటాల సునీత ఆయనపై పలు విమర్శలు చేశారు. కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేశారు.
దానికి అక్కడి వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇది ఒక నియోజకవర్గానికి పరిమితం అనుకుంటే, దానిని హోం మంత్రి రాష్ట్రస్థాయి వివాదంగా మార్చితే, టీడీపీ ఎంపీ జాతీయ స్థాయికి తీసుకువెళ్లే యత్నం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఆయన లేఖ రాసిన తీరు, అందులో ప్రస్తావించిన అంశాలు అన్ని కూడా జగన్ కు వ్యతిరేకంగా పెద్ద కుట్రకు ఏమైనా ప్లాన్ చేశారా అన్న సందేహం వస్తుంది.
విశేషం ఏమిటంటే గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి వారు పల్నాడు ప్రాంతంలో కక్షల రాజకీయాలను ఎగదోసేలా వ్యాఖ్యలు చేసినప్పుడు , ఆయా చోట్ల పోలీసులపై దూషణలకు దిగినప్పుడు ఇదే లావు శ్రీకృష్ణదేవ రాయలు వైసీపీ ఎంపి. టీడీపీ నేతలపై ఆయన కూడా విమర్శలు చేసే ఉంటారు కదా! అదే రాయలును ప్రయోగించి టీడీపీ నాయకత్వం కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయించింది. నిజానికి జగన్ టూర్ సందర్భంగా జరిగిన ఘటనలపై కేంద్రానికి ఫిర్యాదు చేయవలసినంత పరిస్థితి ఏమిటో అర్థం కాదు. పైగా అందులో కేవలం రాప్తాడు అంశంతో ఆపకుండా, గత ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీ చేసే పిచ్చి ఆరోపణలన్నిటిని కలగలిపి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. అవసరం రీత్యా టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ అధిష్టానం పొత్తుకు సిద్దమైంది తప్ప, ఆయనపై నమ్మకం, విశ్వాసంతో కాదన్న సంగతి అందరికి తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోడీని, అమిత్ షా ను చంద్రబాబు ఎంతగా దూషించింది వారికి తెలియదా? జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయినా, ఎన్నడూ అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. బీజేపీ పెద్దలు కూడా జగన్ పై ఆ గౌరవం చూపుతూ వచ్చారు.ఇప్పుడు తెలుగుదేశం వ్యూహాత్మకంగా జగన్ పై వారికి ఉన్న సదభిప్రాయాన్ని చెడగొట్టి, ఏదో రకంగా కేసులు పెట్టించి రాజకీయంగా దెబ్బ కొట్టాలన్న దురుద్దేశంతో ఇలా లేఖలు రాయిస్తున్నట్లు కనబడుతుంది. జగన్ ప్రజలలో తిరుగుతుంటే వస్తున్న ఆదరణ చూసి కూటమి నేతలు ఖంగు తింటున్నారు. జగన్‌ది నిజంగానే కుట్ర స్వభావమై ఉంటే, అసలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు బీజేపీ పంచన చేరే అవకాశం ఎందుకు రానిస్తారు? ఆయనే ఎన్డీయే కూటమిలో చేరి ఉండేవారు కదా! కాని ఒక సిద్దాంతానికి కట్టుబడి ఆయన అందులో చేరలేదు.
అంశాల వారిగా మద్దతు ఇవ్వడం లేదా, వ్యతిరేకించడం చేస్తూ వచ్చారు. ఉదాహరణకు వక్ఫ్ బిల్లుపై వైసీపీ స్పష్టంగా వ్యతిరేకిస్తే, దానిని కూడా వక్రీకరించడానికి టీడీపీ మీడియా ఎన్ని పాట్లు పడింది చూశాం. అదే చంద్రబాబు గతంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక ట్రిపుల్ తలాఖ్, ముస్లింలకు సంబంధించిన ఇతర అంశాల్లోనూ బీజేపీని, మోడీని ఎంతో ఘాటుగా విమర్శించారు. కాని ఇప్పుడు ఎన్డీయేతో కలిసి, కిక్కురుమనకుండా కేంద్రానికి మద్దతు ఇచ్చారు. దీనిపై రాష్ట్రంలో ముస్లిం వర్గాలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.
జగన్ పై 11 సీబీఐ కేసులు, 9 ఈడి కేసులు ఉన్నాయని రాయలు ఇప్పుడు ఆ లేఖలో పేర్కొనడమే కుట్ర. అన్ని కేసులు ఉన్నప్పుడే వైసీపీలో చేరి ఈయన ఎంపీ అయ్యారు కదా! అసలు ఆ కేసులన్నీ కక్ష పూరితమని బీజేపీ నేత, దివంగత సుష్మా స్వరాజ్ పార్లమెంటులోనే చెప్పిన విషయం ఈయనకు తెలియదా? జగన్‌ను ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ అంటూ రాసిన లేఖపై కృష్ణదేవరాయలు సంతకం చేశారంటే ఆయనకు ఆత్మ అనేది ఉందా అన్న సందేహం వస్తుంది. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్ని కుట్రలు చేసిందీ... ఎన్ని అక్రమాలకు పాల్పడిందీ ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకంలోనే ఉన్నాయి కదా? సొంత మామను పదవి నుంచి తోసేసి ఎలాంటి కుట్రలేదని తన తండ్రి రత్తయ్యతో చెప్పించి ఉంటే బాగుండేది.
ఎందుకంటే ఆయన 1996లో లక్ష్మీపార్వతి ఆధ్వర్వంలోని ఎన్టీఆర్ టీడీపీ తరపున పోటీ చేశారు. లావుకు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇస్తూ చంద్రబాబుపై పలు కేసులు ఉన్నాయని, ఆయన కూడా బెయిల్ పై ఉన్నారని, కనుక ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ అని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. జగన్ ప్రజలలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారట. ఎంత దుర్మార్గపు ఆరోపణ. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మతం పేరుతో, కులం పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంత దారుణమైన రాజకీయం చేసింది లావుకు తెలియదా? వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబందించి కూడా జగన్‌పై నీచంగా లేఖలో ప్రస్తావించడం ద్వారా టీడీపీ ఏదో కుట్ర చేస్తోందన్న అనుమానం కలగదా? విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లు ఏ మాదిరిగా పోలీసులను తిట్టింది ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయే.
పోలీసులను జగన్ కక్ష సాధింపులకు వాడుకున్నారట. ఆ పని నిజంగా చేసిఉంటే చంద్రబాబు, లోకేశ్ పవన్ కళ్యాణ్‌లపై అప్పట్లో ఎన్ని కేసులు వచ్చి ఉండాలి? ఇప్పుడు రెడ్ బుక్ పేరుతో జరుగుతున్న అరాచకాలను గమనిస్తే జగన్ టైమ్‌లో ఎక్కడైనా ఒకటి, అరా జరిగాయేమో తప్ప, రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. అయినా కార్యకర్తలను రెచ్చగొట్టి కేసులు పెట్టించుకోవాలని సూచించింది చంద్రబాబు, లోకేశ్‌లు కాదా? ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి ఇస్తానని ఆఫర్ చేసింది వారు కాదా? ఐదేళ్ల క్రితం ఏదో అన్నారనో, లేక ఏదో జరిగిందని, ఇప్పుడు తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ కేసులు పెట్టడాన్ని కక్ష రాజకీయాలు అంటారా? లేక అలాంటి కేసులే పెట్టని జగన్ పాలనను కక్ష పూరిత పాలన అంటారా? జగన్ భద్రతకు సంబంధించి లావుతో పాటు మంత్రి అనిత కూడా ఏదో వాదన చేశారు.
ఈ ఒక్కదానికి సమాధానం చెప్పగలరా? 250 మంది పోలీసులు జగన్ హెలికాఫ్టర్ వద్ద నిజంగా ఉండి ఉంటే, అక్కడ చేరిన వంద మంది,లేదా రెండు వందల మందిని వెనక్కి పంపించలేకపోయారా? వారిని అక్కడకు రాకుండా ఆపలేకపోయారా? ఏపీ పోలీసులు అంత అసమర్థులని వీరు చెబుతున్నారా? హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడంతో వీఐపీలను తీసుకువెళ్లడం రిస్కు అని పైలట్ అన్నారే తప్ప, తాము వెళ్లలేమని ఎక్కడైనా చెప్పారా? ఇంతకు ముందు కూడా జగన్ ఆయా చోట్లకు హెలికాఫ్టర్ లో వెళ్లి వచ్చారు కదా? అక్కడ కూడా ఇలాగే జరిగిందా? లేదే! జగన్ పోలీసులందరిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏదో భూకంపం వచ్చేసినట్లుగా దీనికి కవరేజీ ఇస్తోంది. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పోలీసులను ఉద్దేశించి జగన్ అన్నారు.
మరి చంద్రబాబు, లోకేశ్‌లు పోలీసు అధికారులను అంతకన్నా దారుణంగా దూషించిన వీడియోలు కనబడుతున్నాయి కదా?పోలీసు అధికారుల సంఘం కూడా వాటిని ఎందుకు ప్రస్తావించడం లేదు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా జగన్ నే విమర్శించారు తప్ప, అంతకు ముందు చంద్రబాబు దూషణల గురించి మాట్లాడడం లేదే! హోం మంత్రి అనిత అయితే ఏకంగా టీడీపీని భుజాన వేసుకుని మోస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్న ఎస్.ఐ.ని దమ్మున్నోడు అని ప్రశంసించారంటే ఇంతకన్నా సిగ్గు చేటైన విషయం ఏమి ఉంటుంది? అసలు హోం శాఖలో ఏమి జరుగుతోందో అమెకు తెలుసా అన్నది ఒక సందేహం. ఎందుకంటే రెడ్ బుక్ పేరుతో మొత్తం హోం శాఖను నడుపుతున్నది లోకేశే అని అంతా చెబుతున్నారు.
మీడియాతో మాట్లాడేటప్పుడు వ్యవస్థను పాడుచేసేలా ఒక మంత్రే మాట్లాడిన తీరు చూస్తే తెలుగు దేశం ఆధ్వర్యంలో వ్యవస్థలు ఎంతగా దిగజారాయో అవగతం అవుతుంది. పనిలో పని లావు కృష్ణదేవ రాయలు, కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో సరికొత్త రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని అమిత్ షా కు తెలియచేసి ఆయన మెప్పు పొందగలిగితే బాగుండేది కదా? ఒక వైపు చంద్రబాబు ఆయా స్కామ్ లలో నిందితుడుగా ఉన్నారు. ఆయన కూడా బెయిల్ పైనే ఉన్న విషయం జనం మర్చిపోయారన్నది వారి ఉద్దేశం కావచ్చు. ఆయా స్కాములను నీరుకార్చే పనిలో ఉండి ఉండవచ్చు.
వాటన్నిని కప్పిపుచ్చి జగన్ పై తట్టెడు బురద వేయడం ద్వారా వైసీపీని దెబ్బ తీయాలని అనుకుంటే అది అంత తేలిక కాదు. సూపర్ సిక్స్ గురించి కాని, కక్ష రాజకీయాల గురించి కాని ప్రజలలో ఈ ప్రభుత్వం పట్ల ఏహ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి కొత్త కుట్రలకు ఎల్లో మీడియాతో కలిసి కూటమి ప్రభుత్వం తెరదీసింది. ఈ తరహా వ్యూహాలలో చంద్రబాబును మించిన నేత దేశంలోనే మరెవ్వరైనా ఉన్నారా?
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత