టీమిండియా రికార్డులు.. విశేషాలు | India vs WI: Team India Ends This Season With Few Records | Sakshi
Sakshi News home page

టీమిండియా రికార్డులు.. విశేషాలు

Published Mon, Dec 23 2019 10:07 AM | Last Updated on Mon, Dec 23 2019 10:12 AM

India vs WI: Team India Ends This Season With Few Records - Sakshi

కటక్‌: వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దాంతో టీమిండియా 2–1తో సిరీస్‌ నెగ్గింది.  వెస్టిండీస్‌ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ 48.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ కోహ్లి (81 బంతుల్లో 85; 9 ఫోర్లు),  రాహుల్‌ (89 బంతుల్లో 77; 8 ఫోర్లు, 1 సిక్స్‌), రోహిత్‌ (63 బంతుల్లో 63; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. కోహ్లికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ లభించాయి. కాగా, ఈ మ్యాచ్‌లో చిరస్మరణీయమైన గెలుపును అందుకుని సంవత్సరాన్ని ఘనంగా ముగించిన టీమిండియా పలు రికార్డులను ఖాతాలో వేసుకుంది.

► ఓ ఏడాదిలో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. 22 ఏళ్లుగా శ్రీలంక ఓపెనర్‌ సనత్‌ జయసూర్య (1997లో 2387 పరుగులు) పేరిట ఉన్న ఈ రికార్డును రోహిత్‌ విండీస్‌పై మూడో మ్యాచ్‌లో అధిగమించాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది రోహిత్‌ మూడు ఫార్మాట్‌లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి 2442 పరుగులు సాధించాడు.  

► ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్‌ నిలిచాడు. రోహిత్‌ ఈ ఏడాది 28 వన్డేలు ఆడి 1490 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కోహ్లి (1377), షై హోప్‌ (విండీస్‌–1345) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

►అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు గెల్చుకున్న క్రికెటర్ల జాబితాలో విరాట్‌ కోహ్లి (57 సార్లు) ప్రస్తుతం జాక్వస్‌ కలిస్‌తో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. సచిన్‌ (76 సార్లు), జయసూర్య (58 సార్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.  

► వరుసగా నాలుగో ఏడాది విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్‌లు) అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. కోహ్లి 2016లో 2595... 2017లో 2818... 2018లో 2735... 2019లో 2455 పరుగులు చేశాడు.  

► వన్డేల్లో 300 అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించడం భారత్‌కిది 19వసారి. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ (11 సార్లు), ఆ్రస్టేలియా (10 సార్లు), శ్రీలంక (10 సార్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  

► ఈ మ్యాచ్‌ ద్వారా పేస్‌ బౌలర్‌ నవదీప్‌ సైనీ భారత్‌ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 229వ క్రికెటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ సంవత్సరం భారత్‌ తరఫున ఐదుగురు ఆటగాళ్లు సిరాజ్, విజయ్‌ శంకర్, శుబ్‌మన్‌ గిల్, శివమ్‌ దూబే వన్డేల్లో అరంగేట్రం చేశారు.  

► వెస్టిండీస్‌పై వరుసగా పదో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను భారత్‌ గెల్చుకుంది. ఓ ప్రత్యర్థిపై అత్యధిక వరుస సిరీస్‌ విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. శ్రీలంకపై సాధించిన తొమ్మిది వరుస సిరీస్‌ విజయాల రికార్డును భారత్‌ (2005 నుంచి) సవరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement