
లండన్: ఏడు సార్లు వింబుల్డన్‌లో విజేతగా నిలిచిన మాజీ వరల్డ్ నంబర్ వన్, అమెరికా స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ మరోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. తన ఎనిమిదో టైటిల్ వేటలో ఆమె ఏంజెలిక్ కెర్బర్ (జర్మనీ)ను ఎదుర్కోనుంది. శనివారం జరిగే తుదిపోరులో వీళ్లిద్దరు తలపడనున్నారు. 2016లో వీరిద్దరి మధ్యే జరిగిన ఫైనల్లో సెరెనా విజేతగా నిలిచింది. ప్రసవానంతరం బరిలోకి దిగిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌కు ముందే గాయంతో తప్పుకున్న సెరెనా, ఈ సారి పచ్చికపై తన అసలు ఆటను ప్రదర్శిస్తూ ఫైనల్ చేరడం విశేషం.
సెమీస్‌లో 25వ సీడ్ సెరెనా 6–2, 6–4తో 13వ సీడ్ జులియా జార్జెస్‌పై అలవోక విజయం సాధించింది. 12 ఏళ్లుగా ఏనాడు ప్రిక్వార్టర్ దశను దాటలేకపోయిన జార్జెస్‌ను అమెరికా టెన్నిస్ దిగ్గజం గంటా 10 నిమిషాల్లో ఇంటిదారి పట్టించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్, ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్ చేరిన కెర్బర్ వింబుల్డన్‌లో రెండోసారి ఫైనల్స్‌కు చేరింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో 11వ సీడ్ ఏంజెలిక్ కెర్బర్ వరుస సెట్లలో 12వ సీడ్ జెలీనా ఒస్టాపెంకో (లాత్వియా)పై అలవోక విజయం సాధించింది. గంటా 8 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆమె 6–3, 6–3తో ఒస్టాపెంకోను ఇంటిదారి పట్టించింది. అదేపనిగా అనవసర తప్పిదాలు, డబుల్ ఫాల్ట్‌లతో ఒస్టాపెంకో పరాజయం చవిచూసింది.