భారత్ విజయానికి మరో 6 వికెట్లు తీయాల్సివుండగా.. ఇంగ్లండ్ ఓటమి నుంచి తప్పించుకోవడానికి మరో 214 పరుగులు చేయాలి.
లండన్: భారత్, ఇంగ్లండ్ రెండో టెస్టు రసకందాయంలో పడింది. ఫలితం తేలనున్న ఈ మ్యాచ్లో భారత్ విజయానికి మరో 6 వికెట్లు తీయాల్సివుండగా.. ఇంగ్లండ్ ఓటమి నుంచి తప్పించుకోవడానికి మరో 214 పరుగులు చేయాలి. ఈ నేపథ్యంలో మ్యాచ్ చివరి రోజు ఆట ఇరు జట్లకు చాలా కీలకంకానుంది.
రవీంద్ర జడేజా (68), భువనేశ్వర్ కుమార్ (52) హాఫ్ సెంచరీలతో రాణించి భారత్ను ఆదుకున్నారు. 169/4 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ధోనీసేన 342 పరుగులు చేసింది. ఓ దశలో 235/7 స్కోరుతో ఎదురీదుతున్న భారత్ను జడ్డూ, భువి పటిష్టస్థితికి చేర్చారు. దీంతో ఇంగ్లండ్కు 319 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
అనంతరం లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాట్స్మెన్ రాబ్సన్, కుక్, బాలెన్స్, ఇయాన్ బెల్ అవుటయ్యారు. రూట్, అలీ క్రీజులో ఉన్నారు. ఇషాంత్ రెండు, జడేజా, షమీ చెరో వికెట్ తీశారు.