చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును సాధించడానికి రాజీలేని పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
చేవెళ్ల, న్యూస్‌లైన్: చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును సాధించడానికి రాజీలేని పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్‌నగర్ గ్రామశివారులో గల గండిపేట తెలుగువిజయంలో రెండు రోజులపాటు నిర్వహించిన మహానాడులో బుధవారం రాత్రి ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు సాధనకు కృషిచేస్తానని పేర్కొన్నారు.
అధికార పగ్గాలు చేపట్టబోతున్న సీమాంధ్రతోపాటుగా అధికారంలోలేని తెలంగాణను కూడా అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. గతంలో 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంతోపాటుగా రంగారెడ్డి జిల్లాను కూడా తామే అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. పోలవరంతో పాటుగా చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును సాధించడానికి పోరాటం చేస్తానని చెప్పారు. తెలుగు ప్రజలందరినీ కలుపుకొని అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని వివరించారు.
అదే విధంగా శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు పెట్టడానికి కృషిచేస్తానని, సాధించి తీరుతాననే నమ్మకం ఉందని పేర్కొన్నారు. తెలుగు ప్రజలందరూ బాగుండాలని తాను ఎల్లప్పుడూ కోరుకుంటున్నానని చంద్రబాబు చెప్పారు.