
అధిక వడ్డీ వసూలు చేస్తే కఠిన చర్యలు
● డీఎస్పీ జీవన్‌రెడ్డి ● జైనథ్‌లో వడ్డీ వ్యాపారిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి హెచ్చరించారు. అమాయక ప్రజ లు, రైతుల వద్ద అధిక వడ్డీ వసూలు చేస్తూ వారి భూములను వడ్డీ పేరుతో రాయించుకుంటున్న ఓ వడ్డీ వ్యాపారిపై జైనథ్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జైనథ్ స్టేషన్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జైనథ్ మండలం కేదార్‌పూర్ గ్రామానికి చెందిన బోయర్ రమేశ్ 2011లో 25 శాతం వడ్డీతో రూ.3 లక్షలు ఇచ్చి తన 1.36 ఎకరాల భూమిని తన తమ్ముడు గజాణన్ పేరిట రా యించుకున్నాడని జైనథ్ రైతు గోస్కుల నర్సయ్య ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. 2013లో బాధితుడు రూ.2 లక్షలు, 2017 సంవత్సరంలో రూ.2 లక్షలు చెల్లించాడు. తిరిగి తన భూమిని తనకు ఇచ్చేయాలని చెప్పినా నిరాకరించడంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అలాగే అతడి ఇంటి వద్ద తనిఖీ చేయగా సంతకం చేసిన రెండు ఖాళీ బ్యాంకు చెక్కులు, 32 సేల్ డీడ్లు, రెండు ధరణి సేల్‌డీడ్లు, 31 ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వాటి విలువ దాదాపు రూ.కోటి 55 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. మనీ లెండర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో జైనథ్ సీఐ డి.సాయినాథ్, ఎస్సై పురుషోత్తం పాల్గొన్నారు.