
తిరుపతి, సాక్షి: తిరుమల ప్రతిష్టతను దెబ్బ తీయడమే కూటమి ప్రభుత్వానికి పనిగా మారిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) మండిపడ్డారు. తిరుమలలో గోశాలలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్న ఆయన.. గత మూడు నెలల్లో గోవులు మరణిస్తున్నా ఆ సంగతిని బయటకు రానివ్వడం లేదని సంచలన ఆరోపణలు చేశారు.
శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో పాప ప్రక్షాళన చేస్తామని కూటమి ప్రకటించింది. కానీ, ఇవాళ జరుగుతోంది ఏంటి?. టీటీడీ గోశాల(TTD Goshala)లో అమ్మకంటే అత్యంత పవిత్రంగా గోవులను చూస్తారు. కానీ, తిరుమల గోశాలలో మూడు నెలల్లో వందకు పైగా గోవులు మృతి చెందాయి. మూగజీవాలు దిక్కుమొక్కు లేకుండా మరణిస్తున్నాయి. కనీసం చనిపోయిన ఆవులకు పోస్ట్ మార్టం నిర్వహించలేదు.
.. మా పాలనలో 500 గోవులను దాతల నుంచి సేకరించి సంరక్షించాం. గతంలో వందే గో మాతరం అనే కార్యక్రమం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో చేపట్టాం. అయినా ఎల్లో మీడియా ద్వారా మాపై విషం చిమ్మారు. ఆ ఆవుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. గోవుల పట్ల కూటమి సర్కార్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. లేగదూడలను పట్టించుకునేవాడు లేడు. చెత్తకు వేసినట్లుగా ఆవులకు గ్రాసం వేస్తున్నారు. తొక్కిసలాట ఘటనతో ఎలాంటి సంబంధం లేకపోయినా గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి గోశాలకు ఓ డైరెక్టర్ అంటూ లేడు. డీఎఫ్‌వో స్థాయి అధికారిని గోశాలకు ఇన్చార్జిగా నియమించారు. సాహివాల్ ఆవు గోశాలనుంచి బయటకు వెళ్లి ట్రైన్ కింద పడి చనిపోయింది. టీటీడీకి చెందినది కాదని చెప్పేందుకు చెవులు కట్ చేశారు. గోశాల.. గోవధశాలగా మారింది
.. భగవంతుడితో సమానమైన గోవులకు ఈ పరిస్థితి ఎదురైంది. ఈ మహా పాపం కూటమి సర్కార్, టీటీడీ అధికారులదే. ఇంత జరుగుతున్నా.. పవనానంద స్వామి(Pawan Kalyan) ఎక్కడ? ఏం చేస్తున్నారు?. గోవుల మృతి విషయాన్ని కూటమి ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందన్న భూమన.. గోవుల మృతిపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. హైందవ సమాజం గోశాలలో ఘటనలపై స్పందించాలని కోరారాయన.
