
సీలేరు జల విద్యుత్ కేంద్రంలో రికార్డుల మోత
ఉత్పత్తిలో ఈ ఏడాదిలో మూడు ఆల్ టైమ్ రికార్డుల నమోదు
ఏటా లక్ష్యాన్నిమించి విద్యుదుత్పత్తి చేస్తున్న కేంద్రం
సీలేరు విద్యుత్ కేంద్రం.. 68 ఏళ్ల చరిత్ర. నిరాటంకంగా విద్యుత్ కాంతులు.. ఇప్పటికీ నంబర్ వన్.. అదే వెలుగు.. అదే ఖ్యాతి. విద్యుత్ కేంద్రాల్లో తనకు సాటిలేరు అన్నట్టు దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య పచ్చని కారడవుల్లో ఏర్పాటైన ఈ జల విద్యుత్ కేంద్రం ద్వారా రాష్ట్రానికి నిరంతరం విద్యుత్ సరఫరా అవుతోంది. తాజాగా విద్యుత్ ఉత్పత్తిలో తన రికార్డులను తనే తిరగరాసుకుంటూ విశేష ఆదరణ పొందుతోంది.
సీలేరు : రాష్ట్రంలో గాలి, సూర్యరశి్మ, బొగ్గు, నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాలు ఎన్ని ఉన్నా.. సీలేరు జల విద్యుత్ కేంద్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ఏడాదిలో 365 రోజులు నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఈ కేంద్రం సొంతం. పుష్కలంగా నీటి నిల్వలు ఉండడంతో రాష్ట్రానికి నిరంతరాయంగా విద్యుత్ అందించడంలో ఘనత సాధిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మించి 68 ఏళ్లు గడుస్తోంది. ప్రతి ఏటా లక్ష్యానికి మించి విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం.. అవార్డులు.. రికార్డులను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి మొదటిసారిగా నిర్మించిన ఈ జల విద్యుత్ కేంద్రం దినదినాభివృద్ధి చెందుతోంది.
లక్ష్యానికి మించి ఉత్పత్తి
సీలేరు జల విద్యుత్ కేంద్రం ప్రతి ఏటా లోడిస్పాస్ అధికారులు ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమిస్తోంది. ఈ ఏడాది మూడు సార్లు ఆల్ టైం రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఘనత రాష్ట్రంలో ఏ జల విద్యుత్ కేంద్రానికీ దక్కలేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ కేంద్రాలకు మించి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఫిబ్రవరి 26న 4.949 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి మొదటి ఆల్ టైం రికార్డును చేసుకుంది. గత నెల 24వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 5.126 మిలియన్లు విద్యుత్ ఉత్పత్తి చేసి రెండో రికార్డును నెలకొల్పింది. అదే నెలలో ఒక రోజు వ్యవధిలో 5.325 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసి మరింత ఘనత సాధించింది.

కలిసొస్తున్న నీటి నిల్వలు
ఏపీ జెన్‌కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ పరిధిలోని పలు రిజర్వాయర్లలో ఏడాది పొడువునా నీటి నిల్వల ఉంటాయి. మాచ్‌ఖండ్ మొదలుకొని బలిమెల, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం రిజర్వాయర్లు నిత్యం నిండు కుండల్ని తలపిస్తాయి. అందుకే ఈ కేంద్రంలో నిరంతరం విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటోంది. ఈ కాంప్లెక్స్‌లో 845 మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్లు ఉన్నాయి. ఒక్క సీలేరు జల విద్యుత్ కేంద్రం మాత్రమే ఈ ఆల్ టైం రికార్డు సాధించడంపై ఇంజినీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీలేరు కాంప్లెక్స్ సాధించిన గొప్ప ఘనత
2024–25 మార్చి 31 నాటికి సీలేరు కాంప్లెక్స్‌లోని నాలుగు కేంద్రాలు కలుపుకొని 2453.7 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేశాం. సెంట్రల్ విద్యుత్ అథారిటీ నిర్దేశించిన లక్ష్యం కంటే 167.56 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి అధికంగా చేయడం గొప్ప ఘనత. ఇందుకు కాంప్లెక్స్ మొత్తానికి ఉత్తమ పురస్కారం లభించడం ఆనందంగా ఉంది.
– వాసుదేవరావు, చీఫ్ ఇంజినీరు,సీలేరు జల విద్యుత్ కేంద్రం
సమష్టి కృషితో ఆల్ టైమ్ రికార్డులు
సీలేరు జల విద్యుత్ కేంద్రం నిర్మించి 68 సంవత్సరాలు గడిచించి. ప్రతి ఏటా విద్యుత్ ఉత్పత్తి చేయడంలో ముందుంటున్నాం. నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో అధిక విద్యుత్ ఉత్పత్తికి అవకాశం కలిగింది. ఈ ఏడాది మూడు ఆల్ టైం రికార్డులు సాధించాం. ఇది నా హయాంలో జరగడం ఆనందంగా ఉంది. ఇంజినీర్లు, కారి్మకుల సమష్టి కృషితో ఇది సాధించగలిగాం.
– రాజేంద్ర ప్రసాద్, ఈఈ