
ప్రభుత్వాస్పత్రుల్లో ఇన్సులిన్ కొరత
ఇల్లెందు: షుగర్ వ్యాధిగ్రస్తులు ఉపయోగించే ఇన్సులిన్ ఇంజెక్షన్ల కొరత ఏర్పడింది. నెల రోజులుగా ప్రభుత్వాస్పత్రులకు సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి రావడంతో బాధితులపై ఆర్థికభారం పడుతోంది. ఇన్సులిన్ అవసరమైనవారికి రోజూ రెండు ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇల్లెందు ఏరియా ఆస్పత్రిలోనే వెయ్యి మంది వరకు ఇన్సులిన్ పొందేవారు ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా కనీసం 10 వేల మంది వరకు ఉంటారని వైద్యాధికారులు చెబుతున్నారు. వారానికో ఇంజెక్షన్ల బాక్స్ అవసరమవుతుందని, ఒక్కో దాని ఖరీదు రూ. 250 వరకు ఉండగా, నెలకు రూ. 1000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని బాధితులు వాపోతున్నారు. జిల్లాలో 29 పీహెచ్‌సీలు, 10 యూపీహెచ్‌సీలు, 376 సబ్ సెంటర్లు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, చర్ల, అశ్వారావుపేట, ఇల్లెందు ప్రాంతాల్లో ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో మణుగూరు, అశ్వారావుపేటలో పాత స్టాక్ కొంత ఉండగా మిగతా అన్ని చోట్ల కొరత ఏర్పడింది. ప్రభుత్వ దవాఖానాకు వచ్చే 10 మందిలో 8 మంది రోగులు షుగర్ పరీక్షలు చేయించుకుంటున్నారు. షుగర్ ఎక్కువ ఉందని రిపోర్టు రాగానే డాక్టర్ సంప్రదించటం, అక్కడి నుంచి మందులు ఇచ్చే గదికి పరుగులు తీయటం, అక్కడి ఫార్మాసిస్ట్ ఇన్సులిన్ లేదనటంతో భయంతో మెడికల్ షాపుల వద్దకు వెళ్లి కొనుగోలు చేయడం పరిపాటిగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలకు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్ల సరఫరా నిలిచిపోయింది. ఏరియా ఆస్పత్రుల నుంచి ఇండెంట్ పంపించగా, మందు లేదని సమాచారం వస్తుందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. అయితే బాధితులు మాత్రం ఫార్మసీ సిబ్బందితో ఇంజెక్షన్ కావాలని ఘర్షణకు దిగుతున్నారు. ఈ విషయమై ఇల్లెందు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హర్షవర్ధన్‌ను వివరణ కోరగా.. ఇన్సులిన్ ఇంజెక్షన్ల కొరత వాస్తవమేనని తెలిపారు.
సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి
నిలిచిపోయిన సరఫరా
విధిలేక ప్రైవేటు మెడికల్ షాపులకు వెళ్తున్న బాధితులు
నెలకు ఒక్కొక్కరిపై
రూ.1000 అదనపు భారం

ప్రభుత్వాస్పత్రుల్లో ఇన్సులిన్ కొరత