
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలో 6.44 శాతంగా (2022 ఇదే నెల ధరల బాస్కెట్‌తో పోల్చి) నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం కన్నా ఇది ఎగువన కొనసాగుతుండడం గమనార్హం. అయితే 2023 జనవరి 6.52% కన్నా ద్రవ్యోల్బణం కొంత తగ్గింది. ఆర్‌బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2022 నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి 6 శాతం ఎగువనే కొనసాగుతోంది.
► ఫుడ్ బాస్కెట్ రిటైల్ ద్రవ్యోల్బణం 5.95%గా నమోదైంది. కూరగాయల ధరలు వార్షిక ప్రాతిపదికన చూస్తే, 11.61% తగ్గాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 20%, తృణ ధాన్యా లు, ఉత్పత్తుల ధరలు 17% పెరిగాయి.
► ఫ్యూయెల్ అండ్ లైట్ సెగ్మెంట్‌లో ద్రవ్యోల్బణం 9.90 శాతంగా ఉంది.
రెపో మరింత పెరుగుదల: డీబీఎస్ రిసెర్చ్
ఇదిలాఉండగా, రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువనే కొనసాగుతున్న నేపథ్యంలో, వచ్చే నెల జరగనున్న ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానం సందర్భంగా ఆర్‌బీఐ రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని డీబీఎస్ రిసెర్చ్ తన తాజా నివేదికలో అంచనావేసింది.