
సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల్లో అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్‌తో ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించినట్లు మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ప్రధానంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో భారత్-అమెరికాల మధ్య సహకారానికి అపారమైన అవకాశాలున్నాయని మోదీ తన పోస్టులో నొక్కిచెప్పారు. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు. భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న కీలక సమయంలో ఈ పోస్టు చేయడం గమనార్హం.
టెస్లా త్వరలో భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి కంపెనీ ఇక్కడ కార్యకలాపాలు సాగించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈమేరకు ముంబయిలో ఉద్యోగుల నియామకాలు, షోరూమ్ కోసం స్థల పరిశీలన చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదీ చదవండి: రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లు
మస్క్‌కు చెందిన శాటిలైట్ కమ్యునికేషన్ సిస్టమ్ స్టార్‌లింక్ కూడా భారత్‌లోకి ప్రవేశించనుంది. స్థానికంగా ఉన్న రిలయన్స్, ఎయిర్‌టెల్ వంటి టెలికాం కంపెనీలు ముందుగా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించినా తర్వాత ఆ కంపెనీతోనే భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.