
భారత్ విదేశీ రుణాలు (అంతర్జాతీయ మార్కెట్ నుంచి రుణాలు, ఇతర రూపాల్లో సమీకరించినవి) 2024 డిసెంబర్ చివరికి 717.9 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.61.74 లక్షల కోట్లు) చేరాయి. 2023 డిసెంబర్ చివరికి ఇవి 648.7 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ‘క్వార్టర్లీ ఎక్స్‌టర్నల్ డెట్’ నివేదికలోని గణాంకాలు కింది విధంగా ఉన్నాయి.
2024 సెప్టెంబర్ చివరికి ఇవి 712.7 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే అంతక్రితం త్రైమాసికంతో పోల్చి చూస్తే 0.7 శాతం.. ఏడాది క్రితం ఇదే కాలంతో పోల్చి చూస్తే 10 శాతం అధికమయ్యాయి. జీడీపీలో విదేశీ రుణాలు డిసెంబర్ చివరికి 19.1 శాతానికి చేరాయి. 2024 సెప్టెంబర్ చివరికి 19 శాతంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా రూపాయితోపాటు ఇతర ప్రధాన కరెన్సీలతో డాలర్ బలపడడం విదేశీ రుణ భారం విలువ పెరిగేందుకు దారితీసింది.
ఇదీ చదవండి: మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..
డాలర్ మారకంలో 54.8 శాతం..
యూఎస్ డాలర్ మారకంలోని బకాయిలు మొత్తం విదేశీ రుణాల్లో 54.8 శాతంగా ఉన్నాయి. ఆ తర్వాత రూపాయి మారకంలో విదేశీ రుణాలు 30.6 శాతంగా ఉంటే, జపాన్ యెన్ మారకంలో 6.1 శాతం, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్) రూపంలో 4.7 శాతం, యూరో మారకంలో 3 శాతం చొప్పున ఉన్నాయి. మొత్తం విదేశీ రుణాల్లో నాన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్‌కు సంబంధించి 36.5 శాతం మేర ఉన్నాయి. ఆ తర్వాత డిపాజిట్ స్వీకరించే కార్పొరేషన్లకు సంబంధించి 27.8 శాతం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 22.1 శాతం, ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించి 8.7 శాతం చొప్పున ఉన్నాయి. విదేశీ మారకంలో చెల్లించాల్సిన మొత్తం బకాయిల్లో రుణాల రూపంలో 33.6 శాతం ఉంటే, కరెన్సీ, డిపాజిట్ల రూపంలో 23.1 శాతం, ట్రేడ్ క్రెడిట్, అడ్వాన్స్‌ల రూపంలో 18.8 శాతం, డెట్ సెక్యూరిటీల రూపంలో 16.8 శాతం చొప్పున ఉన్నాయి.