
భారతీయ బ్యాంకులు ఇటీవల పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు తగ్గించడంతో ఈమేరకు బ్యాంకులు కూడా కీలక వడ్డీ రేట్లను కుదించాయి. ప్రపంచ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితుల మధ్య వృద్ధిని ఉత్తేజపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థలోని కొన్ని అంశాలపై ప్రతికూల ప్రభావం కూడా ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రుణాలు, పెట్టుబడులకు ప్రోత్సాహం
తక్కువ వడ్డీ రేట్లు వ్యక్తులు, వ్యాపారాలకు రుణాలు చౌకగా అందేలా చేస్తాయి. ఇది మౌలిక సదుపాయాలు, తయారీ, ఇతర రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఉద్యోగాల సృష్టికి ఊతం ఇస్తుంది. ఆర్థిక విస్తరణకు దారితీస్తుంది. తగ్గిన రుణ ఈఎంఐలు డిస్పోజబుల్ ఆదాయాన్ని(నెలవారీ ఖర్చులుపోను మిగిలిన డబ్బు) పెంచుతాయి. వినియోగదారుల వ్యయాన్ని అధికం చేస్తాయి.
పొదుపుపై ప్రభావం
మరోవైపు పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గుతుండడంతో సంప్రదాయ పొదుపు తగ్గిపోతుంది. దాంతో ఖాతాదారులు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లేదా రియల్ ఎస్టేట్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులవైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇవి అధిక నష్టాలను కలిగి ఉంటాయి కానీ, మంచి రాబడిని అందిస్తాయి. ఫైనాన్షియల్ మార్కెట్లను మరింత బలోపేతం చేయగలిగినప్పటికీ, ఇది మార్కెట్ అస్థిరతకు దారి తీయవచ్చు. బ్యాంకుల్లో పొదుపు డబ్బును ఇలా ఇతర మార్గాలవైపు మళ్లించడం బ్యాంకులకు కొంతమేరకు సవాలుగా మారుతుంది.
ఇదీ చదవండి: ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
ఏం చేయాలంటే..
భారతీయ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం రెండువైపులా పదునున్న కత్తితో సమానం. ఇది ఆర్థిక వృద్ధిని, పెట్టుబడులను ప్రేరేపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, పొదుపుదారులకు, బ్యాంకింగ్ రంగానికి సవాళ్లను మిగులుస్తుంది. ఆర్థిక స్థిరత్వంతో వృద్ధిని సమతుల్యం చేయడానికి ఈ మార్పులు ఎంత సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయనే దానిపై దీర్ఘకాలిక ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఈమేరకు వ్యవస్థలు సమర్థ విధానాలు రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది.