
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల (credit card) వినియోగం బాగా పెరిగింది. దీంతో ఖర్చుల మీద నియంత్రణ లేక క్రెడిట్ కార్డుల బిల్లులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇలా వచ్చిన భారీ మొత్తం బిల్లులను ఒకేసారి కట్టడానికి కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందు కోసమే దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఎస్‌బీఐ (SBI) క్రెడిట్ కార్డు వినియోగదారుల కోసం ప్రత్యేక ఫీచర్ అందుబాటులో ఉంది.
క్రెడిట్ కార్డు పెద్ద మొత్తం బిల్లుల నిర్వహరణను ‘ఎస్‌బీఐ కార్డ్ ఫ్లెక్సీపే’ సదుపాయం సులభతరం చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా కార్డుదారులు పెద్ద కొనుగోళ్లను సులభమైన నెలవారీ వాయిదాలుగా (EMI) మార్చుకోవచ్చు. తద్వారా ఒకేసారి ఏకమొత్తం చెల్లించాల్సిన ఇబ్బందిని లేకుండా చేసుకోవచ్చు. అసలేంటీ ఎస్‌బీఐ ఫ్లెక్సీపే ఫీచర్.. అర్హత ప్రమాణాలు, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎస్‌బీఐ ఫ్లెక్సీపే
ఫ్లెక్సీపే అనేది ఎస్‌బీఐ కార్డ్ అందించే ఫీచర్. ఇది మీ లావాదేవీలను సులభమైన వాయిదాలుగా మార్చుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. రూ.500 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలను ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. ఇది మూడు, ఆరు, తొమ్మిది, 12, 18, 24 నెలలు వంటి రీపేమెంట్ కాలపరిమితి ఎంపికలను అందిస్తుంది.
ఇక రూ.30,000 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్లకు 36 నెలల ఈఎంఐ ప్లాన్ ఎంచుకోవచ్చు. ఫ్లెక్సీపే కోసం కనీస బుకింగ్ మొత్తం రూ .2,500, అయితే ఇది ఆఫర్ల ఆధారంగా మారవచ్చు. అలాగే, గత 30 రోజుల్లో చేసిన లావాదేవీలను ఫ్లెక్సీగా మార్చుకోవచ్చు. క్రెడిట్ కార్డు బిల్లులను ఈఎంఐలను మార్చుకునే ముందు మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది.
ఈఎంఐలుగా మార్చుకోండిలా..
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వినియోగదారులు తమ ఎస్‌బీఐ కార్డ్ ఆన్‌లైన్ ఖాతాలోకి లాగిన్ అయి, 'ఈఎంఐ అండ్ మోర్' విభాగానికి వెళ్లి 'ఫ్లెక్సీపే' ఎంచుకోవచ్చు. మార్చాలనుకుంటున్న లావాదేవీని, తగిన కాలపరిమితిని ఎంచుకుని అభ్యర్థనను ధృవీకరించండి.అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఎస్‌బీఐ కార్డ్ కస్టమర్ సర్వీస్ హెల్ప్ లైన్‌కు కూడా కస్టమర్లు కాల్ చేసి కస్టమర్ సపోర్ట్ టీమ్ సహాయంతో ఈఎంఐ మార్పిడిని అభ్యర్థించవచ్చు. వాళ్లు మీకు ప్రక్రియపై మార్గనిర్దేశం చేస్తారు.
అలాగే వినియోగదారులు ఎస్‌బీఐ కార్డ్ మొబైల్ యాప్‌లోనూ ఫ్లెక్సీపే ఎంపికను యాక్సెస్ చేయవచ్చు. అవసరమైతే లావాదేవీ మొత్తాన్ని సవరించి, కాలపరిమితిని ఎంచుకుని అప్లయి చేయవచ్చు.