
58.5 శాతానికి పీఎంఐ సూచీ
ఫిబ్రవరిలో ఇది 59
న్యూఢిల్లీ: సేవల రంగం కార్యకలాపాలు మార్చి నెలలో నిదానించాయి. డిమాండ్ నిదానించడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ సర్వే తెలిపింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఫిబ్రవరిలో 59 పాయింట్ల వద్ద ఉంటే, మార్చి నెలలో 58.5కు తగ్గింది. అయినప్పటికీ దీర్ఘకాల సగటు అయిన 54.2కు పైనే కొనసాగడం గమనార్హం.
పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 50 పాయింట్లకు పైన ఉంటే విస్తరణగా, దిగువన క్షీణతగా పరిగణిస్తుంటారు. ‘‘మార్చి నెలలో భారత సేవల పీఎంఐ స్వల్పంగా తగ్గి 58.5 వద్ద నమోదైంది దేశీ, అంతర్జాతీయ డిమాండ్ ఉత్సాహంగానే ఉన్నా, ముందటి నెల కంటే కాస్త తగ్గింది’’అని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా చీఫ్ ప్రంజుల్ భండారీ తెలిపారు. అంతర్జాతీయ విక్రయాలు బలహీనపడడం పీఎంఐ తగ్గడానికి కారణమని ఈ సర్వే పేర్కొంది.
విదేశీ ఆర్డర్లు 15 నెలల కనిష్టానికి చేరాయని తెలిపింది. రానున్న కాలంలో కంపెనీల వృద్ధికి పోటీ ప్రధాన సవాలు కానుందని ఈ సర్వే అంచనా వేసింది. సానుకూల సెంటిమెంట్ ఏడు నెలల కనిష్టానికి చేరింది. కన్జ్యూమర్ సర్వీసెస్ సంస్థలు బలమైన పనితీరు చూపించాయి. ఆ తర్వాత ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ అండ్ బిజినెస్ సర్వీసెస్, రవాణా, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ రంగాల్లోనూ పనితీరు మెరుగుపడింది. ఇక హెచ్‌ఎస్‌బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ (తయారీ, సేవలు కలిపి) ఏడు నెలల గరిష్టమైన 59.5కు మార్చిలో చేరుకుంది. ఫిబ్రవరిలో ఇది 58.8గా ఉంది.