డీసీసీబీ చైర్మన్‌గా అమాస రాజశేఖర్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

డీసీసీబీ చైర్మన్‌గా అమాస రాజశేఖర్‌రెడ్డి

Published Tue, Apr 29 2025 7:07 AM | Last Updated on Tue, Apr 29 2025 7:07 AM

డీసీస

డీసీసీబీ చైర్మన్‌గా అమాస రాజశేఖర్‌రెడ్డి

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు డీసీసీబీ చైర్మన్‌గా అమాస రాజశేఖర్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గతంలో కూడా డీసీసీబీగా చైర్మన్‌గా పదవి అనుభవించారు. ఈ పదవిలో 13ఏళ్లుగా కొనసాగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డీసీసీబీ చైర్మన్‌ పదవిని మళ్లీ అమాస రాజశేఖర్‌రెడ్డే సొంతం చేసుకున్నారు. దీంతో సొంత పార్టీ నేతలే చిర్రెత్తిపోతున్నారు. అమాస రాజశేఖర్‌రెడ్డికి పదవి కట్టబెట్టడంపై భగ్గుమంటున్నారు. ఈ చైర్మన్‌ పదవి చిత్తూరు నగరానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత దొరబాబుకే ఇస్తారని తొలి నుంచి కూటమి నేతలు జోరుగా ప్రచారం చేశారు. పక్కాగా దొరబాబుకే ఇస్తారని ఆపార్టీ నేతలు బల్లగుద్ది చెప్పారు. గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే ఆ ఆశలంతా ఇప్పుడు అడియాశలయ్యాయి. కూటమి ప్రభుత్వం వారి ఆశలపై ఊహించని దెబ్బకొట్టింది. ఊహించని వ్యక్తి..అందులో గతంలో పనిచేసిన అమాసకు ఇవ్వడం ఏమిటని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గతంలో డీసీసీబీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పిదాలపై పెదవి విరుస్తున్నారు.

బీరు బాటిల్‌తో దాడి..వ్యక్తి తీవ్రగాయాలు

కార్వేటినగరం: బీరు బాటిల్‌తో దాడి చేయడంతో వ్యక్తి గాయపడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కొల్లాగుంట వద్ద ఉన్న మద్యం షాపులో మద్యం తాగడానికి కొటార్వేడు దళితవాడకు చెందిన భారత్‌రాజ్‌, అదే గ్రామానికి చెందిన జీవరత్నం, రాజ కలసి ద్విచక్రవాహనంలో వెళ్లి మద్యం కొనుగోలు చేసి, ముగ్గురు కలసి మద్యం తాగడానికి సమీపంలోని కొబ్బరి తోటకు వెళ్లారు. అయితే అదే ప్రాంతంలో మద్యం తాగుతున్న కొటార్వేడు దళితవాడకు చెందిన వెంకటేష్‌కు భారత్‌రాజ్‌కు మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో భారత్‌రాజ్‌పై వెంకటేష్‌ బీరుబాటిల్‌తో దాడి చేశాడు. దీంతో భారత్‌రాజ్‌కు గాయాలయ్యాయి. అలాగే భారత్‌రాజ్‌తోపాటు ద్విచక్రవాహనంలో వచ్చి జీవరత్న, రాజ కూడా వెంకటేష్‌తో కలసి భారత్‌రాజ్‌పై దాడికి దిగి గాయపరిచారు. స్థానికులు గుర్తించి అతనిని కార్వేటినగరం సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై భారత్‌రాజ్‌ భార్య కోకిల సోమవారం పోలీసులక ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆత్మస్థైర్యంతో ముందుకుసాగాలి

చిత్తూరు కలెక్టరేట్‌ : బధిరులు ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందుకు సాగాలని జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో బదిరులకు టచ్‌ ఫోన్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ బదిరులు (మూగ, చెవిటి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైకల్యం ఉందని నిరాశ చెందకుండా ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం రూ.15 వేలు విలువ చేసే 30 టచ్‌ ఫోన్‌లను జేసీ చేతుల మీదుగా బదిరులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

చిత్తూరు అర్బన్‌: నగర శివారుల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో జె.ధనంజయులు (39), ఆసీఫ్‌ (35) అనే ఇద్దరు మృతి చెందారు. తాలూక ఎస్‌ఐ మల్లికార్జున కథనం మేరకు.. పెనుమూరు మండలం పూనేపల్లెకు చెందిన ఆసీఫ్‌ కత్తులను గీటురాయి ద్వారా సానా పట్టే వృత్తి చేస్తున్నాడు. నగర శివారుల్లోని మురకంబట్టు వద్ద ఆదివారం తన ద్విచక్రవాహనంలో వెళుతూ, ముందు వెళుతున్న లారీను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ స్కూటరిస్టు ఆదివారం అర్థరాత్రి తమిళనాడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా సోమవారం చిత్తూరు–తచ్చూరు జాతీయ రహదారిపై అనుప్పల్లె సమీపంలో జె.ధనంజయులు తన ద్విచక్రవాహనంపై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొంది. తలకు బలమైన గాయం కావడంతో ధనంజయులు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గ్రానైట్‌ రాళ్లను లోడ్‌ చేసే వృత్తి చేస్తున్నాడు. ఈ రెండు కేసులపై ఎస్‌ఐ మల్లికార్జున కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

డీసీసీబీ చైర్మన్‌గా అమాస రాజశేఖర్‌రెడ్డి 
1
1/2

డీసీసీబీ చైర్మన్‌గా అమాస రాజశేఖర్‌రెడ్డి

డీసీసీబీ చైర్మన్‌గా అమాస రాజశేఖర్‌రెడ్డి 
2
2/2

డీసీసీబీ చైర్మన్‌గా అమాస రాజశేఖర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement