
జర్నలిస్టులపై దాడుల నివారణకు త్వరలోనే కమిటీ
చిత్తూరు అర్బన్: పాత్రికేయులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి వీలైనంత త్వరలోనే ‘జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీ’ ఏర్పాటు చేసి, సమావేశం కూడా నిర్వహిస్తామని చిత్తూరు కలెక్టర్ సుమిత్‌కుమార్ హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తిలో ‘సాక్షి’ రిపోర్టర్ శ్రీనివాసులుపై స్థానిక టీడీపీ నేతలు దాడి చేయడాన్ని ఖండిస్తూ, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ యూ నియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లోకనాథన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఇటీవల పాత్రికేయులపై దాడులు పెరుగుతున్నాయన్నారు. వీటిని ఆదిలోనే అడ్డుకోవాలంటే జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీ రూపొందించి, నిందితులపై తీసుకుంటున్న చర్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి, ఎస్పీతో కలిసి త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఇషార్‌అహ్మద్, చిత్తూరు ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షులు శివప్రసాద్, పవన్‌కుమార్, నవీన్, శివ, చంద్ర, రాజేష్, మహేష్, హరీష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.