
ట్రిపుల్ ఐటీ సంరంభం..
● ఆర్‌జీయూకేటీ నోటిఫికేషన్ విడుదల
● ఆన్‌లైన్‌లో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
● వచ్చేనెల 28 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
రాయవరం: రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్(ఆర్‌జీయూకేటీ)లో 2025–26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల నోటిఫికేషన్ ఈ నెల 24న విడుదల చేశారు. 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల చూపు అంతా ట్రిపుల్ ఐటీ వైపు మళ్లింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్‌లో భాగంగా రాష్ట్రంలో ఉన్న 4 వేల ట్రిపుల్ ఐటీ సీట్లలో జిల్లాకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు.. ఎన్ని సీట్లు వస్తాయనే సందిగ్ధంలో విద్యార్థులు ఉన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. జూన్ 11 నుంచి 17వ తేదీ వరకు స్పెషల్ కేటగిరీ (పీహెచ్/ఎన్‌సీసీ/స్పోర్ట్స్/భారత్ స్కౌట్స్) సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్దేశించిన ఐఐఐటీల్లో చేపట్టనున్నారు. అడ్మిషన్ల అనంతరం ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభిస్తారు.
నాలుగు వేల సీట్లు
రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ఒక్కో చోట వెయ్యి సీట్ల వంతున నాలుగు వేల సీట్లు ఉన్నాయి. వీటికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులైన 48,448 మంది మధ్య ఈ పోటో ఉంటుంది.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే అధిక సీట్లు..
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివిన విద్యార్థులకే ట్రిపుల్ ఐటీలో అధిక సీట్లు వచ్చే అవకాశం ఉంది.
ఎంపిక ప్రక్రియ ఇలా
ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇరువురు విద్యార్థులకు మార్కులు సమానంగా వస్తే తొలుత గణితం, అనంతరం జనరల్ సైన్స్, తదుపరి ఇంగ్లిషు, ఆ తదుపరి సోషల్ స్టడీస్, ఫస్ట్ లాంగ్వేజన్‌లో అధిక మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తారు. అప్పటికీ సమానంగా వస్తే పుట్టిన తేదీ ప్రకారం అధిక వయసు ఉన్న వారిని, హాల్ టికెట్ నంబర్ నుంచి పొందిన అత్యల్ప సంఖ్య ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఇలా
ట్రిపుల్ ఐటీలో చేరేందుకు ఆసక్తి ఉన్న వారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్‌జీయుకేటీ.ఇన్/ఏపీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ విద్యార్థులకు దరఖాస్తు రుసుం రూ.300గా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200గా నిర్దారించారు.
రిజర్వేషన్లు ఇలా
ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు రిజర్వేషన్ నిబందనలు పాటిస్తారు. రాష్ట్రంలోని అభ్యర్థులకు 85 శాతం సీట్లు, మిగిలిన 15 శాతం సీట్లు రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు కేటాయిస్తారు.
ఎస్సీ–15, ఎస్టీ–6, బీసీ(ఎ)–7, బీసీ (బి)–10, బీసీ (సి)–1, బీసీ (డి)–7, బీసీ (ఇ)–4, దివ్యాంగులు–5, ఆర్మీ ఉద్యోగుల పిల్లలు (సీఏపీ)–2, ఎన్‌సీసీ–1, స్పోర్ట్స్–0.5, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్–0.5 శాతం సీట్లు కేటాయిస్తారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ప్రత్యేక కేటగిరీల్లో బాలికలకు 33.1/3 శాతం సీట్లు కేటాయిస్తారు.
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ తేదీ ఏప్రిల్ 24.
ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరణ ఏప్రిల్ 27 నుంచి మే 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు.
ఆన్‌లైన్ స్పెషల్ కేటగిరీ (చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్‌డ్ పర్సనల్) విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన మే 28, 29 తేదీలలో.
స్పోర్ట్స్ కేటగిరి విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన: మే28 నుంచి 30 వరకు.
భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన మే 29న.
ఎన్‌సీసీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మే 29 నుంచి 31 వరకు.
ప్రొవిజినల్ సెలక్షన్ (స్పెషల్ కేటగిరీ కాని విద్యార్థులు) జూన్ 05.
నూజివీడు క్యాంపస్‌కు ఎంపికై న వారి సర్టిఫికెట్ల పరిశీలన జూన్ 11, 12 తేదీలు
ఆర్‌కే వ్యాలీ, ఇడుపులపాయ క్యాంపస్‌లకు ఎంపికై నవారికి జూన్ 12, 14 తేదీలు
శ్రీకాకుళం క్యాంపస్‌కు ఎంపికై న వారికి జూన్ 16, 17 తేదీలలో
ఎంపికై న విద్యార్థులు ఆయా క్యాంపస్‌ల్లో రిపోర్డు చేయాల్సిన తేదీ జూన్ 30
నాడు వైఎస్ చలువతో
గ్రామీణ విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యనందించేందుకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇడుపులపాయ, నూజివీడు, తెలంగాణ రాష్ట్రంలోని బాసరలో ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో అధిక సీట్లు కేటాయించగా, 2010లో ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1000 సీట్లు ఉండేలా కుదించారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ తెలంగాణకు వెళ్లిపోవడంతో 2016లో ఒంగోలు, శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీలు ప్రారంభించారు. ట్రిపుల్ ఐటీల్లో 26 జిల్లాల విద్యార్థులకు సమానంగా సీట్లు ఇచ్చేందుకు వర్శిటీ అధికారులు నిర్ణయించి 4వేల సీట్లలో ఓపెన్ కేటగిరీలో 600 సీట్లను స్థానికేతరులు, తెలంగాణ, ఎన్‌ఆర్‌ఐ, తదితరులకు కేటాయిస్తారు. మిగిలిన 3,400 సీట్లను 26 జిల్లాల వారికి సమానంగా కేటాయిస్తారు. జిల్లాకు కేటాయించే సీట్ల ఆధారంగా మెరిట్ విద్యార్థులకు అవకాశం లభించనుంది.

ట్రిపుల్ ఐటీ సంరంభం..

ట్రిపుల్ ఐటీ సంరంభం..