
కట్ రోజెస్‌ను రెట్టింపు రోజులు తాజాగా ఉంచే పేపర్ ఆవిష్కరణ
మైసూరులోని సీఎఫ్‌టీఆర్‌ఐ ఘనత
సహజ పూల అందమే వేరు. అతిథులకు, ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలిపే పుష్పగుచ్ఛాల్లో రంగు రంగుల కట్ ఫ్లవర్స్ (Cut Flowers) మెరుస్తూ మురిపిస్తూ ఉంటాయి. అయితే, త్వరగా వాడిపోవటం వీటి ప్రధాన సమస్య. దీనిని అధిగమించటానికి మైసూరులోని కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ (సీఎఫ్‌టీఆర్‌ఐ) సరికొత్త పేపర్‌ను తయారుచేసింది. రోజా పూలను ఈ పేపర్‌లో చుట్టి పెడితే సాధారణంకంటే రెట్టింపు కాలం తాజాగా ఉంటాయని సంస్థ చెబుతోంది.
విదేశాలకు కట్ ఫ్లవర్స్ ఎగుమతిచేసే సమయంలో త్వరగా వాడిపోవటం వల్ల 20 నుంచి 25 శాతం వరకు నష్టం వస్తోంది. ఈ నష్టాన్ని నివారించడానికి కేంద్ర శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్‌ఐఆర్) ఫ్లోరీకల్చర్ మిషన్‌ను ప్రారంభించింది. అందులో భాగంగానే (సీఎఫ్‌టీఆర్‌ఐ) ఈ పేపర్‌ను తయారుచేసింది. దీనిపై పేటెంట్ (Patent) కూడా పొందింది.
2020లో ప్రపంచ కట్ ఫ్లవర్ మార్కెట్ విలువ 1,761 కోట్ల డాలర్లు. ఇది 2027 నాటికి 2,668 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఫ్లోరీకల్చర్ మార్కెట్‌లో మన దేశ వాటా 2020లో రూ.18,760 కోట్లు. 2026 నాటికి ఇది రూ. 54,640 కోట్లకు పెరుగుతుందని అంచనా. కట్ రోజెస్ (Cut Roses) ఎగుమతిలో మన దేశం 15వ స్థానంలో ఉంది.
కొత్త పేపర్ ప్రయోజనాలు ఇవీ..
⇒ పర్యావరణహితంగా తయారైన ఈ పేపర్‌లో రోజా కట్ ఫ్లవర్స్‌ను చుట్టి పెడితే చాలు.
⇒ ప్యాకింగ్‌లో ఖరీదైన, విషతుల్యమైన రసాయనాలు వాడనవసరం లేదు.
⇒ సాధారణ ప్యాకింగ్‌లో కన్నా రెట్టింపు రోజులు పూలు తాజాగా ఉంటాయి.
చదవండి: ఒకేసారి ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి.. ఇదేం లొల్లి!
⇒ గులాబీ రేకులు, ఆకులు వాడిపోకుండా, రాలకుండా ఉంటాయి.
⇒ రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారుల ఆదాయం పెరుగుతుంది.
⇒ ఈ పేపర్ రసాయన రహితమైనది. త్వరగా కుళ్లిపోతుంది.
⇒వ్యాక్యూమ్ ప్యాక్‌లో ఈ పేపర్లు ఉంటాయి. ప్యాకెట్ విప్పిన తర్వాత నెల రోజుల్లోపు వాడుకోవాలి.
- సాక్షి స్పెషల్ డెస్క్