గూగుల్‌ లోకల్‌ గైడ్‌.. ఏకంగా 18 వేలకు పైగా పోటోలు, 287 ప్రాంతాలు..! | Kavali Chandrakanth Posted Most Photos On Google Local Guides | Sakshi
Sakshi News home page

గూగుల్‌ లోకల్‌ గైడ్‌.. ఏకంగా 18 వేలకు పైగా పోటోలు, 287 ప్రాంతాలు..!

Published Mon, Mar 31 2025 1:15 PM | Last Updated on Tue, Apr 1 2025 6:39 PM

Kavali Chandrakanth Posted Most Photos On Google Local Guides

ప్రపంచంలోని ఏ ప్రదేశం, ప్రాంతానికి సంబంధించిన ఫొటోలు, ఇతర సమాచారం తెలుసుకోవాలన్నా.. కేరాఫ్‌ అడ్రస్‌ ‘గూగుల్‌ మ్యాప్స్‌’. ఈ వేదికలో ప్రాధాన్యత, విశిష్టత తెలుసుకున్నాకే ఆ ప్రదేశానికి వెళ్లాలా వద్దా అని ప్లాన్‌ చేసుకుంటారు. గూగుల్‌ లోకల్‌ గైడ్స్‌ విభిన్న ప్రదేశాలు సందర్శించి ఈ ఆన్‌లైన్‌ వేదికలో ఫొటోలు పోస్ట్‌ చేస్తారు. ఇలా ఎక్కువ ఫొటోలు ట్యాగ్‌ చేసిన అతికొద్ది మందిలో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ నగరానికి చెందిన కావలి చంద్రకాంత్‌ కూడా ఒకరు. 2017 నుంచి ఇప్పటి వరకూ ఆయన షేర్‌ చేసిన వేల ఫొటోలకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా మిలియన్ల కొద్దీ వ్యూస్‌ రావడం విశేషం. టాప్‌ గూగుల్‌ లోకల్‌ గైడ్‌గా తన ప్రయత్నాన్ని గూగుల్‌ సంస్థ కూడా ప్రత్యేకంగా అభినందించడం మరో విశేషం. ఇప్పటి వరకూ గూగుల్‌ మ్యాప్స్‌కు తాను అందించిన వేల ఫొటోలు కేవలం తన మొబైల్‌ ఫోన్‌లో మాత్రమే తీశానని మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. తన గూగుల్‌ ప్రయాణాన్ని, ఆయన చెబుతున్న ఫొటోల కథలు తయన మాటల్లోనే..                         

నాకు ఫొటోలు తీయడమంటే చాలా ఇష్టం. నా హాబీ మరొకరికి ఏదో విధంగా ఉపయోగపడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలోంచి ఈ గూగుల్‌ మ్యాప్స్‌ కాంట్రిబ్యూషన్‌ మొదలైంది. ఇలా ఇప్పటి వరకూ గూగుల్‌ మ్యాప్స్‌లో 22 వేల ఫొటోలను ట్యాగ్‌ చేశాను. ఇందులో 18,888 కు పైగా ఫొటోలు అందుబాటులో ఉన్నాయి. ఇది ఓపెన్‌ ఫ్లాట్‌ ఫాం.. ఎవరైనా ఫొటోలు వినియోగించుకోవచ్చు. గూగుల్‌ లోకల్‌ గైడ్‌గా వాడుకోవచ్చు. అంతేకాదు ఇదే వేదికలో 382కు పైగా వీడియోలు కూడా పొందుపరిచాను. ఫొటోలు, వీడియోలు పెట్టడంతో పాటు గూగుల్‌ మ్యాప్స్‌లో వాటి విశిష్టతను, ప్రాధాన్యతను తెలియజేసే 257 పైగా సమీక్షలు రాశాను.  

మొదటిసారి మ్యాప్స్‌లో.. 
గతంలో హైదరాబాద్‌లోని మూసీ నది వరదల్లో చిక్కుకున్న 150 మంది వారి ప్రాణాలను కాపాడిన చింత చెట్టు (ఉస్మానియా ఆస్పత్రి ప్రక్కన ఉన్న చింత చెట్టు)ను మొదటి సారి గూగుల్‌ మ్యాప్‌లో చేర్చాను. ఇలా హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 287 పైగా ప్రదేశాలను మొదటిసారి నేనే గూగుల్‌ మ్యాప్స్‌కు పరిచయం చేశాను.  

నా ఫొటోలు శాశ్వతం.. 
నగరంలోని జేఎల్‌ఎల్‌ అనే మల్టీ నేషనల్‌ కంపెనీలో టెక్నికల్‌ ఎగ్జిక్యూటివ్‌ జాబ్‌ చేస్తున్నాను. వీకెండ్స్, ప్రత్యేక సెలవులు, ఖాళీ సమయాల్లో ఈ ఫొటోలు తీస్తుంటాను. బీటెక్, పీజీలో జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ చేశాను. 

ప్రకృతి, వారసత్వ కట్టడాలు, నగరంలోని మల్టీనేషనల్‌ కంపెనీలు, రాష్ట్రంలోని చారిత్రాత్మక అంశాలు–కట్టడాలు, అత్యుత్తమ ప్రాజెక్టులు, అరుదైన విషయాలు–వింతలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఇలా పలు అంశాలను ఫొటోలుగా బంధిస్తుంటాను. నగరంలోని అమేజాన్, అంజాన్, గూగుల్‌ మొదలు టీ హబ్‌ వరకూ అన్ని కంపెనీలకు సంబంధించిన ఫొటోలు ప్రత్యేకంగా తీసి గూగుల్‌ మ్యాప్స్‌లో షేర్‌ చేశాను. 2015 నుంచి ఫొటోలు తీస్తున్నాను.. కానీ నాకు ఇప్పటి వరకూ కెమెరా లేదు. నా మొబైల్‌ ఫోన్‌లో మాత్రమే ఫొటోలు తీస్తాను. ఇప్పటి వరకూ సుమారు 50 వేల ఫొటోలు తీశాను. 

గూగుల్‌ మ్యాప్స్‌లో ప్రస్తుతం మిలియన్ల కొద్దీ వ్యూస్‌ రావడం చాలా ఆనందంగా ఉంది. గతంలో 25 కోట్ల వ్యూస్‌ వచి్చనప్పుడు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అభినందించారు. మా స్వగ్రామం మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పెద్ద మునగల్‌ చేడ్‌ గ్రామం. మా ఊరిలోని స్కూల్‌ శిథిలావస్థలో ఉంటే.. వాటిని ఫొటోలుగా తీసి గ్రామ పెద్దలు, సంబంధిత అధికారుల దృష్టి తీసుకెళ్లగా.. వారి స్పందనతో నూతన స్కూల్‌ నిర్మించారు. 

ఈ సందర్భంగా నా మొదటి ఫొటో ఎగ్జిబిషన్‌ ఈ ప్రారంభోత్సవంలో పెట్టాను. మండలంలోని అడ్డాకల్‌లోని అన్ని గ్రామాలకు సంబంధించిన సమగ్ర అంశాలతో ఒక ప్రాజెక్టు ఫొటోగ్రఫీ జియో ట్యాగింగ్‌లో నిక్షిప్తం చేశాను. ఈ ప్రపంచంలో నేను శాశ్వతం కాదు.. కానీ నా ఫొటోలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇంతకు మించిన సంతృప్తి ఏం ఉంటుంది.  

లోకల్‌ గైడ్స్‌ కనెక్ట్‌లో బెస్ట్‌ ఫొటో.. 
ఇలా గూగుల్‌కు ఫొటోలు అనుసంధానం చేసే వారిని 1 నుంచి 10 వరకూ టాప్‌ లెవల్స్‌లో గుర్తిస్తారు. ఇందులో నేను టాప్‌ 10 స్థానికి చేరుకున్నాను. ఇలాంటి వారందరి కోసం గూగుల్‌ ఆధ్వర్యంలో సాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో గూగుల్‌ లోకల్‌ గైడ్స్‌ కనెక్ట్‌ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహిస్తారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని 2019లో హైదరాబాద్‌ నగర కేంద్రంగా నిర్వహించిన కార్యక్రమంలో టాప్‌ లోకల్‌ గైడ్‌గా నన్ను కూడా ఆహా్వనించడం, ఈ వేదికపై కొండాపూర్‌ జాలన్‌లోని నేను తీసిన నాగ శివాలయం ఫొటో బెస్ట్‌ ఫొటోగ్రాఫ్‌గా ఎంపిక చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. గతంలో జరిగిన గూగుల్‌ లోకల్‌ గైడ్స్‌ ప్రత్యేక సమావేశంలో పాల్గొని ఈ వేదికలో మార్పులు, చేర్పులకు సంబంధించిన సూచనల అంశంలో భాగస్వామ్యం పంచుకున్నాను. 

ఇతర రాష్ట్రాల సమాచారం.. 
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహరాష్ట్ర వంటి ప్రాంతాల్లోని ఫొటోలు గూగుల్‌లో ట్యాగ్‌ చేశాను. గూగుల్‌లోనే కాదు నేను తీసిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇలా విభిన్న ప్రాంతాలు తిరిగి గూగుల్‌కు ఫొటోలను అందించిన ప్రదేశాలు, కట్టడాలు తదితర అంశాలకు సంబంధించి 1,272పైగా రేటింగ్స్, వాటికి సంబంధించి వ్యూయర్స్‌ అడిగిన 1,419 పైగా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను.  

(చదవండి: నగలు నా ఫేవరెట్‌ కలెక్షన్‌..: సూపర్‌స్టార్‌ మహేష్‌ తనయ సితార)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement