రానున్నది ఉష్ణ ప్రకోపమే! | Expert Opinion on Change in climate | Sakshi

రానున్నది ఉష్ణ ప్రకోపమే!

Dec 17 2023 3:38 AM | Updated on Dec 17 2023 5:41 AM

Expert Opinion on Change in climate - Sakshi

వాతావరణం, శీతోష్ణస్థితి గురించి లెక్కలు తీసి రికార్డుగా దాచి ఉంచడం మొదలుపెట్టి 170 సంవత్సరాలకు పైనే అయింది. ఈ మొత్తం కాలంలోనూ 2023వ సంవత్సరం అన్నిటికన్నా వేడి అయినదిగా నమోదవుతుంది అని పరి శోధకులు అప్పుడే చెప్పేస్తున్నారు. ఇటీ వలి కాలం ఇంత వేడిగా ఉండడా నికి మనుషుల కారణంగా మారుతున్న శీతోష్ణస్థితి మాత్రమే అని ఎటువంటి అనుమానం లేకుండా తేల్చేస్తున్నారు.

యూరోపియన్‌ యూనియన్‌ స్పేస్‌ ప్రోగ్రావ్‌ు వారి ‘కోపర్ని కస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీస్‌’ వారి లెక్కల ప్రకారం, ఇంతకు ముందు ఎప్పుడూ వేసంగి ఇంత వేడిగా ఉన్నది లేదు. గతంలో కంటే ఈసారి ఉష్ణోగ్రత 0.32 డిగ్రీ సెల్సియస్‌ సగటున ఎక్కువగా ఉన్నట్టు లెక్క తేలింది. ప్రపంచం మొత్తం మీద మునుపెన్నడూ లేని మూడు వేడి దినాలు నమోదైనట్లు కూడా తెలిసింది. ఇప్పటికే ఈ ఏడాది వేసవికాలం మునుపెన్నడూ లేనంత వేడిగా ఉందని లెక్కతేల్చి పెట్టారు. 2023వ సంవత్సరంలో నెలల ప్రకారం లెక్కలు చూచినా... ప్రపంచమంతటా ఆరు మాసాలు అంతకు ముందు ఎన్నడూ లేని వేడి కనబరిచినట్టు ఇప్పటికే లెక్కలు వచ్చాయి. అంటార్కిటికాలో మంచు కూడా అంతకు ముందు ఎన్నడూ లేనంతగా కరిగిపోయినట్టు కూడా గమనించారు.

ప్రపంచంలో పారిశ్రామికీకరణ కన్నా ముందు కూడా వాతా వరణంలోని వేడి గురించిన రికార్డులు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు సగటున ప్రపంచం మొత్తం మీద 1.46 డిగ్రీల సెల్సియస్‌ వేడి పారిశ్రామికీకరణకు ముందున్న వేడి కన్నా ఎక్కువగా ఉంది. పరిశ్రమల వల్ల వాతావరణం వేడెక్కుతున్న దన్న భావన చాలాకాలంగా ప్రపంచంలో ఉండటం తెలిసిందే. 2016లో వేడిమి ఎక్కువగా ఉన్నట్టు ఇప్పటి వరకు ఉన్న రికార్డులు తెలుపుతున్నాయి. అయితే ఈ సంవత్సరం వేడి 2016లో కన్నా ఎక్కువగా ఉన్నట్టు నమోదయింది. ఈ ప్రకారంగా ఇప్పటి వరకు రికార్డులో ఉన్న సంవత్సరాల అన్నింటిలోకీ 2023 అత్యంత వేడిగా ఉన్నట్టు లెక్క తేలింది. ఈ విషయాన్ని ఈ మధ్యనే ‘సీ త్రీ ఎస్‌’ సంస్థ పరిశోధకురాలు సమంతా బుర్జెస్‌ ఒక ప్రకటనలో బయటపెట్టారు.

శరత్‌ కాలం కూడా వేడిగా ఉండడానికి ‘ఎల్‌ నినో’ కారణం అని ఇప్పటికే మనకంతా తెలుసు. ఎల్‌ నినో వల్ల భూమధ్య రేఖ వద్ద సముద్రాలలో ఉపరితలం నీరు వేడెక్కుతుంది. దాని వల్ల ప్రపంచంలోని గాలులు వేడవుతాయి. 2023 జూన్‌లోనే ఈ ప్రక్రియ మొదలైంది. వచ్చే ఏడాది కూడా ఈ వేడి కొనసాగుతుందని అంటున్నారు. గడచిన మూడు సంవత్సరాల పాటుఎల్‌ నినోకు వ్యతిరేకంగా ఉండే ‘లా నినా’ అనే పరిస్థితి కారణంగా వేడిమి కొంతవరకు అదుపులో ఉంది. ఈ ‘లా నినా’ప్రస్తుతం లేదు. కనుక వేడిమి హద్దు లేకుండా పెరుగుతున్నది. మరికొంతమంది నిపుణులు టోంగాలో సముద్రం లోపల 2022లో పేలిన అగ్నిపర్వతం కారణంగా వేడి నీటి ఆవిరులు వాతావరణంలో పెరిగాయనీ, ఈ సంవత్సరం వేడి పెరుగుదలకు అది కూడా కొంతవరకు కారణం కావచ్చుననీ అంటున్నారు. అయితే పరి శోధకులు మాత్రం ఈ విషయం గురించి అను మానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచమంతటా వాతావరణం వేడిగా మారడానికి ‘గ్లోబల్‌ వార్మింగ్‌’ అన్న ప్రక్రియ కారణం అని అందరికీ తెలుసు. గ్రీన్‌ హౌస్‌ వాయువుల కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతున్నదని కూడా తెలుసు. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచ వాతావరణంలో 25 బిలి యన్‌ల అణుబాంబుల శక్తికి సమానంగా ఉష్ణశక్తి చేరిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇదంతా గడిచిన 50 సంవ త్సరాల పాటు జరిగిన మార్పు. ఈ మార్పు ఒక పక్కన గాలిని వేడెక్కిస్తుండగా, మరొక పక్కన ఊహకు అందకుండా ఎల్‌ నినో వచ్చే పరిస్థితులకు దారితీస్తున్నది.

రానురానూ పరిస్థితి మరింత దారుణంగా మారుతున్నది. డిసెంబర్‌ 4న ‘కాప్‌’ 28 అనే యునైటెడ్‌ నేషన్స్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. వాతావరణంలోకి కార్బన్‌ డై ఆక్సైడ్‌నుపంపించడం ఈ సంవత్సరం అంతకు ముందు ఎన్నడూ లేని స్థాయికి చేరిందని అక్కడ ప్రకటించారు. పరిస్థితి ఇలాగుంటే, వాతావరణం నియంత్రణలో ఉంటుందని అనుకోవడానికి వీలే లేదు అన్నారు అక్కడ.గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావాలు ప్రస్ఫుటంగా బయట పడు తున్నాయి. ప్రపంచమంతటా తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రపంచంలోని పెద్ద పెద్ద సరస్సులు, జలాశయాలు సగం కుదించుకుపోయాయి. సముద్ర అంతర్భాగంలో ఉండే గల్ఫ్‌ ప్రవాహం కూడా ప్రభావం కనపరు స్తున్నది. సముద్ర మట్టాలు ఎక్కడికక్కడ పెరుగుతున్నాయి.

అయితే పరిశోధకులు, పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి అవ కాశాలు ఇంకా ఉన్నాయి అని ఆశాభావం కనబరుస్తున్నారు. వాతావరణంలో మార్పులను మనకు అనుకూలంగా మార్చే మార్గాలు లేకపోలేదు అంటున్నారు పెన్సిల్వేనియా విశ్వ విద్యా లయం పరిశోధకులు. కానీ ఆ అవకాశం కూడా రానురానూ తగ్గి పోతున్నది అన్నది వారి అభిప్రాయం.

కె. బి. గోపాలం
వ్యాసకర్త సైన్స్‌ రచయిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement