
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రివేళ భారత్ ఎలా కనిపిస్తుందో తెలుసా? ఇదుగో, సరిగ్గా ఇలా! నక్షత్రాల వలయం కిందుగా నగరాల తాలూకు విద్యుద్దీప కాంతుల్లో ధగధగా మెరిసిపోతోంది కదూ. ఐఎస్‌ఎస్ నుంచి తీసిన ఈ ఫొటోను నాసా ఆదివారం విడుదల చేసింది. మేఘావృతమైన అమెరికా, అందమైన ఆగ్నేయాసియా తీర ప్రాంతం, ఆకుపచ్చని అరోరా కాంతులతో కూడిన కెనడా తాలూకు ఫొటోలను కూడా ఎక్స్‌లో పంచుకుంది.
‘‘పైన నక్షత్రాలు, కింద మహానగరాల తాలూకు కాంతులు. దిగంతాల వెంబడి పరుచుకున్న వాతావరణపు మసక వెలుతురులు. అచ్చెరువొందించే అందాలకు ఆలవాలం మన భూగోళం’’ అంటూ చక్కని క్యాప్షన్ జోడించింది. అంతరిక్షం నుంచి భారత్ భలేగా కనిపిస్తోందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ‘అయితే భారతీయులమంతా సాలెగూడులా అందంగా విస్తరించామన్నమాట’ అంటూ ఒక యూజర్ మురిసిపోయాడు.