
19న మరోసారి సమావేశం
మస్కట్: ఇరాన్, అమెరికా ప్రతినిధుల ముఖాముఖి మొదటి విడత చర్చలు శనివారం ఒమన్ రాజధాని మస్కట్‌లో ముగిశాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు జరిపేందుకు వీరు వచ్చే వారం మరోసారి సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యాక మొదటి విడత చర్చలు పూర్తయినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి కొద్దిసేపు మాట్లాడుకున్నట్లు ఇరాన్ వార్తా సంస్థ పేర్కొంది.
కాగా, ఈ నెల 19వ తేదీన తదుపరి విడత పరోక్ష చర్చలు జరుపుతామని అరగ్చి తెలిపారు. ‘ఫలితం లేని ఈ చర్చలతో సమయం వృథా. వీటిపై ఎవరికీ ఆసక్తి లేదు’అని పేర్కొన్నారు. మస్కట్ శివారులోని ఓ భవనంలో సమావేశమైన రెండు దేశాల ప్రతినిధులు రెండు గంటలపాటు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో చర్చలు ముఖాముఖి జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రతినిధి విట్కాఫ్ తెలపడం గమనార్హం. అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడమన్నదే తమ లక్ష్యమని ఇరాన్‌కు తెలిపినట్లు విట్కాఫ్ అంటున్నారు.