స్మార్ట్‌ పీపుల్‌ కావాలి | US Needs Smart People says Donald Trump | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ పీపుల్‌ కావాలి

Published Thu, Jan 2 2025 5:55 AM | Last Updated on Thu, Jan 2 2025 5:55 AM

US Needs Smart People says Donald Trump

అమెరికా హెచ్‌1బీ వీసాల జారీని మరోసారి సమర్థించిన ట్రంప్‌

వాషింగ్టన్‌: స్థానిక అమెరికన్లకే అధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న రిపబ్లికన్ల ఎన్నికల హామీకి విరుద్ధంగా విదేశీయులకు హెచ్‌–1బీ వీసాల జారీని ప్రపంచ కుబేరుడు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ సహ సారథి వివేక్‌ రామస్వామి సమర్థిస్తున్న వేళ కాబోయే అమెరికా అధ్యక్షుడు మరోసారి హెచ్‌–1బీ వీసాలను సమర్థించారు. అమెరికాకు ఎల్లప్పుడూ కేవలం సమర్థవంతులైన వ్యక్తులే అవసరమని ట్రంప్‌ నొక్కి చెప్పారు.

 ‘‘ అమెరికాకు ఎల్లప్పుడూ సమర్థవంతులైన వ్యక్తులే కావాలని నేను ఆశిస్తా. స్మార్ట్‌ జనం మాత్రమే అగ్రరాజ్యంలో అడుగుపెట్టాలి. గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాలో ఉద్యోగ కల్పన జరగ బోతోంది. దేశానికి నైపుణ్యవంతమైన కార్మికుల అవసరం చాలా ఉంది’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా బుధవారం అమెరికాలోని మార్‌–ఏ–లాగో రిసార్ట్‌లో ట్రంప్‌ను స్థానిక మీడియా పలకరించింది. 

‘‘హెచ్‌–1బీ వీసాలపై నా అభిప్రాయం ఎన్నటికీ మారదు. నిఫుణులే అమెరికాకు కావాలి’’ అని స్పష్టంచేశారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ఏర్పాటైన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీకి సంయుక్త సారథులుగా నియమితులైన ఎలాన్‌ మస్క్, వివేక్‌ రామస్వామి హెచ్‌–1బీ వీసాల జారీని సమర్థిస్తూ వ్యాఖ్యానించడం, వారికి ఇప్పటికే ట్రంప్‌ మద్దతు పలకడం తెల్సిందే. అయితే అమెరికన్లకే తొలి ప్రాధాన్యం అంటూ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన ట్రంప్‌ ఇప్పుడు మాట మార్చారని అమెరికన్‌ మీడియా చేస్తున్న వాదనలను ట్రంప్‌ తోసిపుచ్చారు.

 మొదట్నుంచీ తాను హెచ్‌–1బీకి అనుకూలమేనని పునరుద్ఘాటించారు. కేవలం అత్యంత నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకే ఉపాధి కల్పిస్తూ స్థానిక సాధారణ, తక్కువ నైపుణ్యమున్న అమెరికన్లకు సరైన ఉద్యోగాలు దక్కకపోతే ఆగ్రహావేశాలు భవిష్యత్తులో పెరిగే ప్రమాదముందని రాజకీయ పండితుడు క్రేగ్‌ ఆగ్రనోఫ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. 

‘‘ ఐటీ రంగంలో ముఖ్యమైన ఉద్యోగాలన్నీ హెచ్‌–1బీ వీసాదారులకే తన్నుకు పోతే స్థానిక ఐటీ ఉద్యోగార్థుల పరిస్థితి ఏంటి?’ అనే ప్రశ్నకు ఇంతకాలం ఏ నేతా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని క్రేగ్‌ వ్యాఖ్యానించారు. స్థానిక అమెరికన్లతో పోలిస్తే తక్కువ వేతనాలకే ఎక్కువ నైపుణ్యాలున్న విదేశీయులు లభిస్తుండటంతో అమెరికన్‌ కంపెనీలు హెచ్‌–1బీ వీసా విధానం ద్వారా విదేశీయులకే అధిక ప్రాధాన్యతనిచ్చి అమెరికాకు రప్పిస్తుండటం తెల్సిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement