
మెట్టు.. మెరిసేలా..
ఫ ఆకర్షణీయంగా రెండో మెట్ల మార్గం నిర్మాణం
ఫ ప్రత్యేక యంత్రాలతో రాళ్ల కటింగ్
ఫ మూడు నెలల్లో పూర్తి కానున్న పనులు
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి వెళ్లేందుకు నిర్మిస్తున్న రెండో మెట్ల దారి నున్నటి మెట్లతో మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటోంది. రాజస్తాన్ నుంచి తీసుకువచ్చిన యంత్రంలో కట్ చేసిన రాళ్లను ఈ మెట్ల దారిలో ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న మొదటి మెట్ల దారిలో ఉపయోగించిన రాళ్లు చేతితో చెక్కినవి. వాటిలో అంత నునుపు కనిపించదు. యితే ప్రస్తుతం నిర్మిస్తున్న రెండో మెట్ల దారిలో ఉపయోగిస్తున్న రాళ్లను గ్రానైట్, మార్బుల్ రాళ్ల మాదిరిగా మెషీన్లతో కట్ చేసి, ఫినిషింగ్ ఇస్తున్నారు. ఈ రాళ్లతో వేస్తున్న మెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
250 మెట్లు.. రూ.90 లక్షలు
మొదటి ఘాట్ రోడ్డు వద్ద ప్రారంభమయ్యే ఈ మార్గం రత్నగిరిపై ఓల్డ్ సీసీ, న్యూ సీసీ సత్రాల మధ్య రోడ్డులో ముగుస్తుంది. అక్కడి నుంచి సత్యదేవుని ఆలయం 200 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ మార్గంలో మూడు మలుపులతో 250 మెట్లు నిర్మించనున్నారు. వీటిని నిర్మాణానికి సుమారు రూ.90 లక్షల అంచనాతో గత ఏడాది టెండర్ ఖరారు చేశారు. 2010లో అప్పటి దేవస్థానం ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఈ మెట్ల మార్గం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం సత్యదేవుని ఆలయానికి వెళ్లేందుకు తొలి పావంచా వద్ద నుంచి 400 మెట్లతో ఒక మార్గం ఉంది. అది మొదటి ఘాట్ రోడ్డుకు సుమారు అర కిలోమీటరు దూరంలో ఉంది. టూరిస్టు బస్సులలో వస్తున్న భక్తులు తమ వాహనాలను దేవస్థానం కళాశాల మైదానంలో నిలుపు చేసి, తొలి పావంచా వద్ద ఉన్న మెట్ల మార్గంలో కొండపై ఉన్న సత్యదేవుని ఆలయానికి చేరుకోవడం ఇబ్బందిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మొదటి ఘాట్ రోడ్డు నుంచి రెండో మెట్ల మార్గం నిర్మిస్తే స్వామివారి ఆలయానికి చేరుకోవడానికి భక్తులకు వీలుగా ఉంటుందని రామచంద్ర మోహన్ భావించారు. ఆ తరువాత ఆయన ఇక్కడి నుంచి బదిలీ అవ్వడంతో ఆ ప్రతిపాదన మూలన పడింది. తిరిగి 2023లో ఆయన అన్నవరం దేవస్థానం ఈఓగా నియమితులైన తరువాత ఈ మెట్ల దారి నిర్మాణానికి టెండర్లు పిలిచి, ఖరారు చేశారు.
రాజస్తాన్ మెషీన్లతో..
మొదట పనివారు ఉలితో చెక్కిన రాళ్లను ఈ మెట్ల మార్గంలో ఉపయోగించాలని అనుకున్నారు. అయితే, ఆ రాళ్లతో వేసిన మెట్లు అంత అందంగా లేవని భావించారు. రాజస్తాన్ నుంచి ఒక మెషీన్ తీసుకుని వచ్చి, దేవస్థానం గ్రౌండ్‌లో ఉంచి, ఈ రాళ్లను అందంగా కట్ చేస్తున్నారు. త్వరలో ఇంకో మెషీన్ కూడా తీసుకు వస్తామని అధికారులు తెలిపారు. మరో మూడు నెలల్లో ఈ మెట్ల మార్గం పనులు పూర్తి చేస్తామని దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ, డీఈ ఉదయ్ కుమార్ తెలిపారు. మెషీన్‌తో కట్ చేసిన రాళ్లతో నిర్మించిన మెట్లు ఆకర్షణీయంగా ఉండటంతో పాటు భక్తుల రాకపోకలకు సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.