
డీఎస్సీ అభ్యర్థుల్లో కట్టలు తెంచుకున్న ఆక్రోశం
కర్నూలు కలెక్టరేట్ ముట్టడి
పోలీసులు, నిరుద్యోగ అభ్యర్థుల మధ్య తోపులాట
కర్నూలు(సెంట్రల్) : సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను నమ్మి మోసపోయామని డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అదిగో.. ఇదిగో అంటూ డీఎస్సీ నోటిఫికేషన్ కాలయాపన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్‌ను ముట్టడించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయతి్నంచారు. పోలీసులు అడ్డుకోవడంతో గేట్లు ఎక్కి దూకేందుకు ప్రయతి్నంచగా తోపులాట చోటు చేసుకుంది. చివరకు కేసులుపెట్టి జైలుకు పంపుతామని త్రీటౌన్ సీఐ శేషయ్య హెచ్చరించడం.. కలెక్టర్ తరపున స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగ ప్రసన్న లక్ష్మీ వచ్చి వివరణ ఇవ్వడంతో నిరుద్యోగులు కాస్తా వెనక్కి తగ్గారు.
ప్రతి నెలా రూ.10వేల పైనే ఖర్చు
డీఎస్సీ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాం. ఎలాగైనా టీచర్ కావాలన్నదే నా లక్ష్యం. డీఎస్సీ కోచింగ్, ప్రిపరేషన్ కోసం హాస్టల్‌లో ఉండటంతో ప్రతినెలా రూ.10వేల పైనే ఖర్చు అవుతోంది. ప్రభుత్వం మా బాధలను పట్టించుకోవాలి.
– దేవిబాయి, ఎల్‌బండతండా, వెల్దుర్తి మండలం
సీఎం మొదటి సంతకానికే దిక్కులేకపోతే ఎలా?
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్చిలోపు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినా మాట నిలుపుకోలేదన్నారు. చంద్రబాబునాయుడు కలుగజేసుకొని ఏప్రిల్‌లో ఇస్తామని చెప్పినా మళ్లీ శిక్షణ అంటూ కాలయాపన చేస్తున్నారు. సీఎం చేసిన మొదటి సంతకానికే దిక్కులేకపోతే ఎలా. వారం రోజుల్లో నోటిఫికేషన్‌ను విడుదల చేయకపోతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల కాన్వాయ్‌లను అడ్డుకుంటాం.
కాలయాపన దేనికి సంకేతం
గత ప్రభుత్వ హయాంలో వచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి మెగా డీఎస్సీ అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ను పది రోజుల్లో విడుదల చేస్తామని చెప్పి మొదటి సంతకం చేశారు. పది నెలలు గడిచినా అతీగతీ లేదు. కాలయాపన దేనికి సంకేతం.
– సులోచన, శివవరం, నంద్యాల జిల్లా