
హీరో నాని(Nani) నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 'కోర్ట్–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ'(Court - State Vs. A Nobodycourt). ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మార్చి 14న హోలీ పండగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రలలో మెప్పించగా.. ఇందులో శివాజీ అద్భుతమైన నటనతో మెప్పించారు. సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలకంగా నటించారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడాలని విమర్శకులు సైతం కామెంట్ చేయడం విశేషం. సెన్సిటివ్ పోలీస్ కేసు విషయంలో మన చట్టాలు ఎలా ఉంటాయో ఈ చిత్రం చెబుతుందని వారు తెలిపారు.
'కోర్టు' సినిమా 'ఏప్రిల్ 11'న విడుదల కానుందని 'నెట్‌ఫ్లిక్స్'(Netflix) అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే తమ ఓటీటీ కమింగ్‌సూన్ బ్లాక్‌లో ఈ సినిమాను చేర్చారు. అందులోనే స్ట్రీమింగ్ వివరాలను ప్రకటించారు. తెలుగతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. కేవలం రూ. 10 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్‌కు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆపై సుమారు రూ. 8 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాతో హీరో నానికి మంచిపేరు రావడమే కాకుండా భారీ లాభాన్ని కూడా తెచ్చిపెట్టింది.

కథేంటంటే..
ఈ సినిమా కథంతా 2013లో సాగుతుంది. విశాఖపట్నంలో మంగపతి(శివాజీ)కి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య(శుభలేఖ సుధాకర్) ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం తనది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త ఫ్యాషన్ దుస్తులు ధరించినా సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి(శ్రీదేవి) ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్ చదువుతున్న జాబిలి.. ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాచ్‌మెన్ కొడుకు చంద్రశేఖర్ అలియాస్ చందు(రోషన్)తో ప్రేమలో పడుతుంది.
ఈ విషయం మంగపతికి తెలిసి.. తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు? జూనియర్ లాయర్ సూర్యతేజ(ప్రియదర్శి) ఎలాంటి సహాయం చేశాడు? అసలు పోక్సో చట్టం ఏం చెబుతోంది? ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కోర్ట్’ సినిమా చూడాల్సిందే.