
‘‘మా రాజేంద్రప్రసాద్ అన్నయ్య నటించిన ‘షష్టి పూర్తి’ ఫీల్ గుడ్ సినిమా అవుతుందనిపిస్తోంది. అందరూ చూడండి’’ అని హీరో రవితేజ చెప్పారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో, రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో హీరో రూపేష్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం నుంచి ‘ఇరు కనులు కనులు కలిసి మురిసె...’ అంటూ సాగే రెండో పాటని రవితేజ ఆవిష్కరించారు. రెహమాన్ రాసిన ఈ పాటను ఎస్పీ చరణ్, విభావరి ఆలపించారు. ఈశ్వర్ కొరియోగ్రఫీ చేశారు. ‘‘ఈ పాటకు ఇళయరాజాగారు బాణీ ఇవ్వగానే ‘సాగర సంగమం’ చిత్రంలోని ‘మౌనమేలనోయి’లా గొప్ప పాట అవుతుందనే అనుభూతి కలిగింది’’ అని తెలిపారు పవన్ ప్రభ.