
నేడు చింతలపల్లిలో బీఆర్‌ఎస్ రజతోత్సవం
సాక్షిప్రతినిధి, వరంగల్:
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో నేడు (ఆదివారం) నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజ తోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి జనాలను సమీకరించే పనిలో నాయకులు తలమునకలయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలకు 10 లక్షల మంది వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి జనాల ను సభకు తరలించేందుకు వాహన సౌకర్యం కూడా కల్పించారు. ఆదివారం సాయంత్రం 4:30 గంటలలోపు సభా ప్రాంగణానికి చేరుకునేలా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ ఏర్పడి 24 ఏళ్లు పూర్తయి 25వ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో.. రజతోత్సవం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ఈ సభను ఎల్కతుర్తిలో నిర్వహించడం చర్చనీయాంశం కాగా.. దారులన్నీ ఎల్కతుర్తి వైపే కదులుతున్నాయి.
బాహుబలి వేదిక.. తరలివస్తున్న జనం
గులాబీ పార్టీ పాతికేళ్ల పండుగకు ఎల్కతుర్తి చూడముచ్చటగా ముస్తాబైంది. చరిత్రలో నిలిచేలా నిర్వహించే ఈవేడుకల కోసం ఎల్కతుర్తి ఎక్స్ రోడ్డులో బాహుబలి సభావేదిక రెడీ అయ్యింది. రజతోత్సవానికి అధినాయకత్వం ఎంచుకున్న ఎల్కతుర్తి ఎక్స్‌రోడ్డు సమీపంలో వేదిక నయనానందంగా రూపుదిద్దుకుంది. ఇందుకోసం పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో 1,213 ఎకరాలను రైతుల నుంచి సమీకరించిన గులాబీ శ్రేణులు సుమారు నెల రోజులుగా శ్రమించారు. సుమారు పది లక్షల మంది హాజరయ్యే ఈ వేడుకకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
సభావేదిక ఏర్పాట్లలో ఆ ఆరుగురు..
గులాబీ దళపతి, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు, సూచనలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో ఆరుగురు నేతలు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్ అవిశ్రాంతంగా శ్రమించారు. ఎల్కతుర్తి, శివారు గ్రామాల రైతుల నుంచి భూముల హామీ పత్రాల స్వీకరణ మొదలు.. సభావేదిక ఏర్పాటు వరకు అధినేత ఆదేశాల మేరకు పని చేశారు.
పోలీసుల భారీ బందోబస్తు
ఎల్కతుర్తి: సభకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఇదివరకే సభా ప్రాంగణాన్ని పరిశీలించి నిర్వాహకులతో చర్చించారు. సభలో ఎలాంటి అవాంతరాలు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా భారీగా పోలీసులను నియమించారు. ఇద్దరు డీసీపీలు, మరో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఎనిమిది మంది ఏసీపీలు, 28 మంది సీఐలు, 66 మంది ఎస్సైలు, 137 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 511 మంది కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులతోపాటు మిగతా డిస్ట్రిక్ట్ గార్డ్స్‌ను నియమించారు. మొత్తం 1,100 మందికిపైగా పోలీసులను కేటాయించారు. హెలిపాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ క్రౌడ్ కంట్రోలింగ్ తదితర ప్రాంతాల్లో సేవలందించనున్నారు.
వరంగల్ నగరం నుంచి ఎల్కతుర్తి వరకు ప్రదర్శనగా వెళ్తున్న ఆటోలు
గంటకుపైగా ప్రసంగించనున్న కేసీఆర్
హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరనున్న అధినేత కేసీఆర్ నేరుగా సభావేదికకు సుమారు 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగుతారు. సుమారు 5.30 గంటల సమయంలో వేదికపైకి చేరుకునే అవకాశం ఉంది. వేదికపై ఆయన సుమారు గంటకుపైగా ప్రసంగించే అవకాశం ఉందని పార్టీవర్గాల సమాచారం.
పాతికేళ్ల పండుగకు తరలుతున్న జనం
ఉమ్మడి వరంగల్ టార్గెట్
2.50 లక్షల మంది
జన సమీకరణలో నాయకుల తలమునకలు
సాయంత్రం 4.30 గంటలలోపు
సభకు చేరేలా ప్లాన్
5.30 గంటల సమయంలో
వేదికపైకి అధినేత కేసీఆర్

నేడు చింతలపల్లిలో బీఆర్‌ఎస్ రజతోత్సవం

నేడు చింతలపల్లిలో బీఆర్‌ఎస్ రజతోత్సవం