
నోయిడా: బహుళ అంతస్తుల భవంతి లిఫ్ట్‌లో ఆరేళ్ల విద్యార్థిపై పెంపుడు శునకం దాడి ఘటనలో కుక్క యజమానిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. చిన్నారి చేతికి గాయం కావడంతో చికిత్సకయ్యే ఖర్చంతా భరించాలని, మరో రూ.10,000 పరిహారంగా చెల్లించాలని ఆయనను గ్రేటర్ నోయిడా అథారిటీ ఆదేశించింది. గ్రేటర్ నోయిడా(పశ్చిమం)లోని విలాసవంత లా రెసిడెన్షియా సొసైటీలో మంగళవారం ఈ ఘటన జరిగింది.
సొసైటీలో ఉండే ఒకావిడ తన కొడుకుతో కలిసి లిఫ్ట్‌లో వెళ్తుండగా అప్పుడే ఒకతను తన కుక్కతో సహా లిఫ్ట్‌లోకి వచ్చాడు. వచ్చీరాగానే బాలుడిని కుక్క కరిచేసింది. దీంతో సీసీటీవీ ఫుటేజీ సాక్ష్యంతో ఐపీసీ సెక్షన్ 289 కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు చెప్పారు. ‘కుక్కను అదుపుచేయడంలో మీరు విఫలమయ్యారు’ అని అతడికి పంపిన నోటీసులో గ్రేటర్ నోయిడా అథారిటీ ఆరోగ్యవిభాగాధిపతి డాక్టర్ ప్రేమ్‌చంద్ పేర్కొన్నారు. రూ.10వేలు, చికిత్స ఖర్చు ఏడు రోజుల్లో చెల్లించకపోతే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.