
కరోనా వైరస్‌కు సంబంధించి రెండు టీకా డోసులు తీసుకోవడం లేదా ఆర్‌పీసీఆర్ పరీక్ష నివేదిక ఉన్నవారికి మాత్రమే...
చండీగఢ్: కరోనా వైరస్‌కు సంబంధించి రెండు టీకా డోసులు తీసుకోవడం లేదా ఆర్‌పీసీఆర్ పరీక్ష నివేదిక ఉన్నవారికి మాత్రమే సోమవారం నుంచి పంజాబ్‌లోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. పొరుగున ఉన్న హిమాచల్ ప్రదేశ్, జమ్మూ నుంచి వచ్చే ప్రజలను ఖచ్చితంగా తనిఖీలు చేస్తామని ఆయన అన్నారు. పంజాబ్‌లోని పాఠశాలలు, కళాశాలల్లో పూర్తిగా టీకాలు వేసుకున్న టీచింగ్, బోధనేతర సిబ్బంది లేదా ఇటీవల కోవిడ్ -19 నుంచి కోలుకున్న వారు మాత్రమే భౌతికంగా బోధించడానికి హాజరు కావచ్చని వెల్లడించారు. కాగా పంజాబ్‌లో శుక్రవారం 88 కోవిడ్ కేసులు, జీరో మరణాలు నమోదయ్యాయి.
రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య దాదాపు ఆరు లక్షలకు చేరుకుంది. ఇక పంజాబ్ ప్రభుత్వం పాఠశాలను తిరిగి తెరిచిన తర్వాత కోవిడ్ పరీక్షను వేగవంతం చేసింది. పాఠశాలల నుంచి ప్రతిరోజూ కనీసం 10,000 మందికి ఆర్‌పీసీఆర్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా పంజాబ్‌తో పాటు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లోని పాఠశాలల్లో కూడా ఆఫ్‌లైన్ తరగతులు తిరిగి ప్రారంభమైనందున గత వారంలో చాలా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్, దేశంలోని ఇతర ప్రాంతాల్లో పెరుగుతున్న కేసుల కారణంగా పంజాబ్‌లో కోవిడ్ పాజిటివిటీ రేటు స్వల్పంగా 0.2 శాతానికి పెరిగింది.