
రాజస్థాన్‌లో వివాదాస్పద నేత జ్ఞానదేవ్ అహూజాపై ఎట్టకేలకు అక్కడి బీజేపీ విభాగం చర్యలు తీసుకుంది. క్రమశిక్షణా చర్యల ఉల్లంఘనకుగానూ షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆలయంలో గంగా జలంతో శుద్ధి చేయడమే ఇందుకు కారణం!!.
ఆల్వాల్‌లో శ్రీరామ నవమి సందర్భంగా ఓ ఆలయంలో జరిగిన ప్రాణ ప్రతిష్టకు కాంగ్రెస్ నేత తికారాం జల్లీ హాజరయ్యారు. అయితే దళిత నేత అడుగుపెట్టి ఆలయం అపవిత్రం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహూజా గంగా జలంతో ఆ ఆలయాన్ని శుద్ధి చేశారు. ఈ పరిణామం దళిత సంఘాలకు ఆగ్రహావేశాలు తెప్పించింది.
ఈ చర్య పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉందని పేర్కొంటూ బీజేపీ ఎంపీ దామోదర్ అగర్వాల్ , అహుజాకు నోటీసులు పంపించారు. మూడు రోజుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాథోడ్‌కు వివరణ ఇవ్వాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

జ్ఞానదేవ్ అహూజా.. 2013-18 మధ్య రామ్‌ఘడ్ ఎమ్మెల్యేగా పని చేశారు. వివాదాల్లో నిలవడం ఈయనకు కొత్తేం కాదు. 2016లో.. జేఎన్‌యూలో జాతీ వ్యతిరేక నినాదాల వ్యవహారంపై స్పందిస్తూ జ్ఞానదేవ్ తీవ్రవ్యాఖ్యలే చేశారు. జేఎన్‌యూలో నిత్యం 3 వేల కండోమ్స్, 2 వేల లిక్కర్ బాటిల్స్ దొరుకుతాయంటూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. 2017లో గోవుల అక్రమ రవాణా చేస్తున్నాడని పెహ్లూ ఖాన్ అనే పాడి రైతును మూక దాడిలో చంపడాన్ని కూడా అహూజా సమర్థించారు.