
హిమాచల్‌లో ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీలో సందడి నెలకొంది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారనే చర్చ జోరుగా సాగింది. సీఎం పదవి కోసం చాలా మంది ప్రయత్నాలు చేయడంతో ఒకరిని ఎంపిక చేయడం పార్టీకి పెద్ద సవాల్‌గా మారింది. తాజాగా హిమాచల్‌లో ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది.
రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని నిర్ణయించే అధికారాన్ని పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీర్మానించిన సంగతి తెలిసిందే. దీంతో హిమాచల్ సీఎంగా సీనియర్ నాయకుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పదవిని ఆశిస్తున్న ఇతర నేతలతో చర్చించిన తర్వాత ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
కొత్తగా ఎన్నికైన సీఎం డిసెంబర్ 11 ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై సుఖ్వీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. హైకమాండ్ నిర్ణయం గురించి తనకు తెలియదని అన్నారు. సాయంత్రం జరిగే కాంగ్రెస్ లెజిస్టేచర్ పార్టీ సమావేశానికి వెళుతున్నానని చెప్పారు.
కాగా గురువారం వెల్లడైన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సంపూర్ణ మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. బీజేపీకి 25 స్థానాలు దక్కించుకోగా.. స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవలేదు.
చదవండి: ఆ ట్వీట్ గురించి కాదు..తృణమాల్ నేత బీజేపీపై ఫైర్