
‘‘ఏ సంస్థను మేం ఇక్కడ నిందించడం లేదు. అలాగే వాటి పని తీరును మేం తప్పుబట్టడం లేదు. దేశంలో వేల మంది కన్నీళ్లు పెడుతున్నారు. అంతమంది కన్నీళ్లను మేం తుడవలేకపోవచ్చు. కానీ, వాళ్ల సమస్యలను మేం ప్రస్తావిస్తాం. కచ్చితంగా సీబీఐ విచారణ జరిపిస్తాం. ఇది మాత్రం స్పష్టం’’ అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ: బ్యాంకులకు, బిల్డర్లు.. డెవలపర్లు మధ్య నలిగిపోతూ ఏళ్ల తరబడి సొంతింటి కల కోసం ఆశగా ఎదురు చూస్తున్న కొందరు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్లను ఒక్కటిగా విచారణ జరిపిన జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం.. వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చింది.
బిల్డర్లు, డెవలపర్లు తమ చేతికి ఇంటి తాళాలు ఇవ్వకపోయినా.. ఇంకోవైపు నుంచి బ్యాంకులు ఈఎంలు కట్టాలని వేధిస్తున్నాయని పలువురు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో హోంబయ్యర్లను లోన్లకు మాధ్యమంగా ఉపయోగించుకుంటున్నారని.. ఒకవేళ బయ్యర్లు గనుక అభ్యంతరాలు వ్యక్తం చేస్తే బ్యాంకులు వాళ్లపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ తరుణంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కాలపరిమితితో కూడిన సీబీఐ దర్యాప్తునకు కచ్చితంగా ఆదేశిస్తామని తెలిపింది. అలాగే.. ఈ పనిని ఎలా చేపట్టాలనే దానిపై ఒక ప్రణాళికను దాఖలు చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థను కోరింది. ఈ క్రమంలో ఫైనాన్షియర్ల తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీపై జస్టిస్ సూర్యకాంత్ మండిపడ్డారు.
బ్యాంకులు ఎలా పనిచేస్తాయో మాకు తెలుసు. సైట్‌లో ఒక్క ఇటుక కూడా పెట్టలేదని మీకు తెలుసు. అయినా కూడా 60 శాతం పేమెంట్ చేసేశారు. సైట్‌లో ఏం జరుగుతోందో తెలుసుకోకుండా ఇలా ఏలా చేశారు? అని ప్రశ్నించారు. ఇది ఇది లక్షల మంది జీవితాలకు సంబంధించిన అంశమని, అవసరమైతే మూలాల్లోకి వెళ్లి పరిశీలిస్తామని, సహాయం కోసం అమీకస్ క్యూరీని నియమించుకునే అవకాశాలు కూడా పరిశీలిస్తామని పేర్కొంటూ తదుపురి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సాధారణంగా కేసులు ఎక్కువగా ఉన్నప్పుడే అమీకస్ క్యూరీని కోర్టు నియమించుకుంటుంది.
ఇదిలా ఉంటే.. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని హోంబయ్యర్లకు కిందటి ఏడాది జులైలో తన ఆదేశాల ద్వారా భారీ ఊరట ఇచ్చింది సుప్రీం కోర్టు. ఇంటి తాళాలు అందుకోని యాజమానులపై ఈఎంఐ రికవరీ సహా బలవంతపు చర్యలు ఉండకూడదని స్పష్టం చేసింది. అయితే ఆ దేశాల ఆచరణకు నోచుకోవడం లేదు. పైగా ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న సందర్భాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి.