
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో వరుసగా జరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనలు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతృత్వంలోని మమత ప్రభుత్వంపై బీజేపీ నేత సువేందు అధికారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సువేందు అధికారి డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ గూండాలు, రేపిస్టుల చేతుల్లో ఉందని సువేందు ఆరోపించారు. శనివారం నుంచి ఇప్పటి వరకు ఏడు లైంగిక వేధింపుల ఘటనలు జరిగాయని అన్నారు. నిందితులు టీఎంసీతోప్రత్యక్ష సంబంధం కలిగినవారేనని, వీరని మమతా బెనర్జీ పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు. మమతా సాగిస్తున్న అవినీతిని బీజేపీ బయటపెడుతుందని అన్నారు.
అంతకుముందు బీర్‌భూమ్‌లో నర్సుపై వేధింపుల ఘటనపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ సీఎం మమతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరిపాలనతో పాటు పోలీసింగ్ వైఫల్యమే ఇటువంటి ఘటనలకు కారణమన్నారు. మమతకు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. ఆమె తప్పుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు.