
సాక్షి, చెన్నై : ఎన్నికల విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్ జవాను ఏకే47తో గొంతులో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సేలంలో ఎన్నికల విధుల నిమిత్తం వంద మంది పారా మిలిటరీ, సీఐఎస్‌ఎఫ్ జవానులు అన్నదాన పట్టిలో బస చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయాన్నే ఓ గది నుంచి తుపాకీ పేలిన శబ్దం రావడంతో అక్కడున్న జవాన్లలో ఆందోళన మొదలైంది. వెంటనే అటు వైపుగా కొందరు పరుగులు తీశారు. అక్కడ ఓ జవాను గొంతులో ఏకే 47తో కాల్చుకుని పడి ఉండటంతో తక్షణం ఆస్పత్రికి తరలించారు. ఆ జవాను ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు. ఆ జవాను పేరు ఆశిష్ కుమార్(30) అని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ విభాగంలో ఆశిష్ విధులు నిర్వర్తిస్తున్నారు. పని భారంతో ఆత్మహత్యాయత్నం చేశాడా..? లేదా, కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా..? అన్న కోణంలో అన్నదాన పట్టి పోలీసులు విచారిస్తున్నారు.