
ఆయనది అభిమానం కాదు. అమితమైన ప్రేమ. అంతకుమించి.. ఆరాధన
Viral News: ఆయనది అభిమానం కాదు. అమితమైన ప్రేమ. అంతకుమించిన పదంతో చెప్పాలంటే.. ఆరాధన. అందుకే ఆయన చేస్తున్న పని కూడా అంతే ప్రత్యేకంగా అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. చనిపోయిన భార్య తన కంటికి దూరం కాకూడదనే ఉద్దేశంతో.. ఆమెకు గుర్తుగా గుడిని కట్టించాడు ఓ పెద్దాయన.
తమిళనాడు కోయంబత్తూరులోని ఓ కుగ్రామంలో 75 ఏళ్ల పళనిస్వామి వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. 45 ఏళ్లపాటు పళనిస్వామి-సరస్వతమ్మల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగింది. 2019 జనవరి 21న ఆయన సరస్వతి జబ్బు చేసి హఠాత్తుగా కన్నుమూసింది. కొంతకాలం ఆయన మానసికంగా కుంగిపోయాడు. అయితే.. ఆమె జ్ఞాపకాలను దూరం చేసుకోకూడదని బాగా ఆలోచించాడాయన. చివరికి భార్యకు గుడి కట్టించిన భర్తల కథలు తెలుసుకుని ఆ స్ఫూర్తితో.. తానూ ఆ పని చేయాలనుకున్నాడు.
సరస్వతమ్మ కోసం ఓ గుడిని కట్టించాడు. భార్య మొదటి వర్థంతి నాడు విగ్రహ ప్రతిష్ట చేశాడు. ఆమె విగ్రహాన్ని నిత్యం శుభ్రం చేస్తూ.. రెండు పూటలా తన ఇంటి దీపానికి దీపారాధన చేస్తూ వస్తున్నాడు. ముంతాజ్ కోసం షాజహాన్ కట్టించిన తాజ్‌మహల్ ప్రేమ చిహ్నమంటూ చరిత్ర ద్వారా చెప్పుకోవడమే గానీ.. ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమను కళ్లారా చూసినప్పుడు కలిగే ఆనందమే వేరు.