
పోటెత్తిన అర్జీదారులు
● కిటకిటలాడిన ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
● పెన్షన్ కోసం వచ్చిన వారే అధికం
● గడువులోగా వినతులకు
పరిష్కారం : కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. పెన్షన్ మంజూరు కోసమే ఎక్కువ మంది రావడంతో కలెక్టరేట్ కిటకిటలాడింది. మొత్తం 188 వినతులు రాగా అందులో 30 వరకు పెన్షన్‌లకు సంబంధించినవి కావడం విశేషం. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాట్లాడుతూ.. వచ్చే వినతులను సంబంధిత లాగిన్‌లో అధికారులు పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. అలాగే రీ ఓపెన్ కేసులపై విచారణ త్వరగా పూర్తి చేయాలని ఆదేవించారు. అంతకుముందు జేసీ సేతు మాధవన్, డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు మురళి, ప్రమీలతో కలిసి వినతులు స్వీకరించారు. మొత్తం 188 అర్జీలు అందగా భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 80 వినతులు అందాయి. పంచాయతీరాజ్ శాఖకు 15.. ఫింఛన్లు మంజూరు చేయాలని, తదితర అంశాలపై డీఆర్‌డీఏకు 30.. మున్సిపాలిటీకి 07.. జీఎస్‌డబ్ల్యూకు 06.. విద్యాశాఖకు 05.. హౌసింగ్‌కు 02 .. విద్యుత్ శాఖకు 02.. వైద్యశాఖకు ఒకటి.. మిగిలినవి ఇతర శాఖలకు సంబంధించినవి.
సమయ పాలన పాటించాలి..
ప్రభుత్వ కార్యాలయాలకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. చాలా మంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రతిరోజూ ఉదయం 10.45 గంటలకు అన్ని కార్యాలయాల హాజరు పట్టీని ఫొటో తీసి డీఆర్‌ఓకు పంపించాలని ఆదేశించారు. అలాగే వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
త్వరితగతిన పరిష్కరించాలి
● కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో 88 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ, రీసర్వే, భూ వివాదాలు, ఉపాధి అవకాశాలు పౌరసరఫరా సేవలు, గృహపట్టాలు, తదితర అంశాలపై అర్జీలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ హేమలత, కేఆర్‌సీసీ ప్రత్యేక ఉపకలెక్టర్ పి. ధర్మచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎన్. సుధారాణి, వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
● బాలగుడబ లంకెల చెరువును ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని నీటి వినియోగదారుల సంఘ అధ్యక్షుడు పి. అప్పారావు ఫిర్యాదు చేశారు.
● కురుపాం మండలం లండగొల్లిగూడ గ్రామంలో బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఎక్కువగా ఉన్నందున గ్రామానికి మినీ అంగన్‌వాడీ కేంద్రం మంజూరు చేయాలని చేయాలని బి. ఇందిరమ్మ, తదితరులు వినతిపత్రం అందజేశారు.
● గుమ్మక్ష్మీపురం మండలం వనకాబడి, వండిడి గ్రామాలకు ఆశా కార్యకర్తల పోస్టులు కేటాయించి, భర్తీ చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరారు.
● జియ్యమ్మవలస మండలం తురకనాయుడువలస గ్రామానికి చెందిన ఎ. సూరమ్మ వందశాతం అంగవైకల్యంతో బాధపడుతున్నానని, పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేసింది.

పోటెత్తిన అర్జీదారులు