
ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం పూర్తిగా అపహస్యం అవుతుందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు.
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: గిరిజన కుటుంబంపై దాడికి పాల్పడిన అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును తక్షణం అరెస్ట్ చేయాలని వైఎస్సార్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం గోపాలపురంలో ఎమ్మెల్యే దాడితో మనస్థానం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యురాలు భూక్యా చంటిని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, పార్టీ నేతలు దేవినేని అవినాష్, నల్లగట్ల స్వామిదాసు, రాయన భాగ్యలక్ష్మిలతో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా భూక్యా చంటి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ..
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ ప్రతినిధి బృందం గోపాలపురంలోని భూక్యాం చంటి కుటుంబాన్ని పరామర్శించింది. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అరాచకం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం పూర్తిగా అపహాస్యం పాలవుతోంది. రాజ్యాంగ విలువలకు పూర్తిగా తూట్లు పొడిచేలా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. భూక్యా చంటిపై దాడి దీనికి నిదర్శనం. వారి కుటుంబానికి సంబంధించిన ఉమ్మడి ఆస్తిని భాగాలుగా విభజించుకునే క్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు జోక్యం చేసుకోవడం, ఆ కుటుంబంలోని వారిపై బూటుకాలితో తన్ని దాడి చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు.
ఇదీ చదవండి: కొలికపూడి కలరింగ్
ఈ దాడి వల్ల భూక్యా చంటి మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితిని కల్పించారు. ఇటువంటి అరాచకాలు చేసే ఎమ్మెల్యే కొలికపూడి పరిపాలనలో ఏ రకంగా భాగస్వామిగా ఉండటానికి అర్హుడని ప్రశ్నిస్తున్నాం. దీనికి కొలికపూడి బాధ్యత వహించాలి. తక్షణం ఆయనపై చట్టపరంగా చర్య తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడిని ఖండించింది. గిరిజన కుటుంబంపై అత్యంత హేయంగా జరిగిన ఈ దౌర్జన్యంకు కారకుడైన కొలికపూడి శ్రీనివాసరావును అధికార తెలుగుదేశం పార్టీ వెనకేసుకు రావడం దారుణం. క్రమశిక్షణ సంఘం పేరుతో ఆయనను పిలిపించి, ఏదో మందలించామన్నట్లుగా హైడ్రామా సృష్టించారు. నిజంగా చిత్తశుద్ది ఉంటే తక్షణం కొలికపూడి శ్రీనివాసరావుపై చట్ట పరంగా కేసు నమోదు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరచాలి.
అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్న ఎమ్మెల్యే: దేవినేని అవినాష్
తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నాడని వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. సంక్రాంతికి ముందు ఒక ప్రైవేటు స్థలం వివాదంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు జోక్యం చేసుకుని గోపాలపురం గ్రామంలోని వైయస్ఆర్సీపీ వార్డు సభ్యురాలు భూక్యా చంటి, ఆమె భర్త కృష్ణ, వారి కుమారులపై ప్రత్యక్షంగా దాడిచేసి గాయపరిచిన ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలి.
బాధ్యతయుతమైన ఎమ్మెల్యే స్థానంలో ఉన్న నేత ఇటువంటి దాడులకు పాల్పడితే ఇక సామాన్యులకు రక్షణ ఉంటుందా? తెలుగుదేశం పార్టీ ఈ ఘటనపై పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న ఆగ్రహంతో క్రమశిక్షణ సంఘం పేరుతో హంగామా చేసి, చేతులు దులుపుకున్నారు. ఈ దాడిని చిత్రీకరించిన భూక్యా చంటి కుమారుడి సెల్ ఫోన్‌ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకుని దానిలోని వీడియోను డిలీట్ చేయడం ఎంత వరకు సమంజసం? గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏనాడు ఇటువంటి దాడులను ప్రోత్సహించలేదు. నేడు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకం సృష్టిస్తున్నారు. చివరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఈ ఎమ్మెల్యే అరాచకాలపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భూక్యా చంటి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది.