సాక్షి, విజయవాడ: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. జోగి రమేష్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘అనుకున్నట్లే కక్ష సాధింపు చర్యలకు దిగారు. అగ్రిగోల్డ్ భూముల కేసులో రాజీవ్ పాత్ర ఉంటే చర్యలు తీసుకోండి.. కానీ లీగల్‌గా కొన్న భూములకు ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్నారు. జోగి రమేష్‌కి అపఖ్యాతి తెచ్చేందుకు అరెస్టులు చేసి దర్యాప్తు పేరుతో వేధిస్తున్నారు. పథకం ప్రకారమే దాడి జరుగుతుంది. కేసులు పెడితే సరిపోదు మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కక్ష సాధింపు చర్యలో భాగంగా జోగి రమేష్ పావుగా మారారు.’’ అని మేరుగ పేర్కొన్నారు.
తిరగబడే రోజులు వస్తాయి: వెల్లంపల్లి శ్రీనివాస్
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తప్పు జరిగితే పోలీసులు విచారణ చేయాలి. జోగి రమేష్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నారనే అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారు. తప్పుడు కేసులకు వైఎస్సార్‌సీపీ నేతలు ఎవ్వరూ తలొగ్గరు. జోగి రమేష్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోం. అమ్మఒడి,రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు. పథకాల అమలుపై నిలదీస్తారని భయపడి ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారు. ఇలాగే ప్రభుత్వ వ్యవహరిస్తే వైఎస్సార్‌సీపీ నేతలు తిరగబడే రోజులు వస్తాయి’’ అంటూ వెల్లంపల్లి వార్నింగ్ ఇచ్చారు.
గొంతు నొక్కాలని చూస్తే ఊరుకోం: లేళ్ల అప్పిరెడ్డి
బలహీన వర్గాల నాయకుడిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మండిపడ్డారు. జోగి రమేష్ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలే టార్గెట్‌గా ప్రభుత్వం పనిచేస్తోందని దుయ్యబట్టారు. ‘‘లీగల్ గానే భూమిని కొనుగోలు చేశారు. లీగల్‌గానే అమ్మారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ఏపీకి వస్తే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. రాజీవ్‌పై అక్రమ కేసులు పెట్టడం ద్వారా జోగి రమేష్ గొంతు నొక్కాలని చూస్తే ఊరుకోం’’ అని లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment