
సాక్షి, అమరావతి: బద్వేల్ నియోజవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ అఖండ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సీఎం జగన్ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు అన్ని రంగాలలో పెద్దపీట వేశారని పేర్కొన్నారు.
బద్వేల్‌లో మంగళ, బుధవారాల్లో ప్రచారం నిర్వహించేందుకు ఆయన సోమవారం తాడేపల్లి నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సీఎం సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వైఎస్సార్ కుటుంబంతో బద్వేల్ ఓటర్లకు విడదీయరాని అనుబంధం ఉందని, ఎన్నో ఏళ్లుగా ఆ కుటుంబానికి అండగా ఉంటున్నారని సజ్జల చెప్పారు.