
టీజీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
జహీరాబాద్‌టౌన్: తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలోని హోతి(కె) జూనియర్ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సురేఖ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23 వరకు దరఖాస్తుకు గడువు ఉందని వెల్లడించారు. 2025 మార్చిలో పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు.
పార్టీ బలోపేతానికి
కృషి చేయాలి
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి పిలుపునిచ్చారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సంగారెడ్డిలోని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఆమె పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోదావరి మాట్లాడుతూ...కార్యకర్తలందరూ పార్టీ పటిష్టత కోసం కృషి చేయడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నడూ లేనివిధంగా నేడు దక్షిణాదిలో కూడా కాషాయ జెండా రెపరెపలాడే సమయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్‌రావు, రాజశేఖర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట నరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక హక్కులను
కాలరాస్తోంది
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్
పటాన్‌చెరు టౌన్: కార్మిక వర్గం సాధించుకున్న హక్కులను కేంద్రంలోని మోదీ సర్కారు కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ విమర్శించారు. కార్మిక వర్గాల ఐక్యత కోసం సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు బీటీ రణదివె ఎనలేని కృషి చేశారన్నారు. బీటీ రణదివె 35వ వర్థంతిని పురస్కరించుకుని ఆదివారం పటాన్‌చెరులోని శ్రామిక్ భవన్ లో ఆయన చిత్రపటానికి మల్లికార్జున్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ....సామాజిక న్యాయ వారోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 14 వరకు మహనీయుల జయంతి, వర్థంతి కార్యక్రమాలు జరపాలని పిలుపునిచ్చారు.
ప్రజల్లో చిరస్థాయిగా గద్దర్
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రజా సమస్యల కోసం పోరుబాట పట్టిన ప్రజా గాయకుడు గద్దర్ అణగారిన వర్గాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల పేర్కొన్నారు. తెల్లాపూర్‌లోని గద్దర్ విగ్రహం వద్ద మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్, గద్దర్ గళం వ్యవస్థాపకుడు కె.సత్తయ్య ఆధ్వర్యంలో రూ.1.25 కోట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న గద్దర్ స్మృతివనానికి ఆదివారం ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం గద్దర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...1997 ఏప్రిల్ 6న ప్రజా గాయకుడు గద్దర్‌పై కాల్పులు జరిగాయని గుర్తు చేశారు. అణగారిన వర్గాలలో చైతన్యం రగిలించి అస్తమించిన సూర్యుడే గద్దరని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు గాదె ఇన్నయ్య, పాశం యాదగిరి, గజ్జల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

టీజీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

టీజీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం