
జిన్నారం ఇక బల్దియా..!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో మరో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు కాబోతోంది. జిన్నారం మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా చేస్తూ జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. జిన్నారంతో పాటు తొమ్మిది గ్రామాలను కలిపి ఈ మున్సిపాలిటీగా ఏర్పాటు కానుంది. జిన్నారం, కొడకంచి, ఊట్ల, శివనగర్, సోలక్‌పల్లి, నల్తూరు, రాళ్లకత్వ, అండూర్, జంగంపేట, మంగంపేట గ్రామాలు కలిపి కొత్త బల్దియాగా రూపాంతరం చెందనుంది. మొత్తం 17,956 మంది జనాభా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుందని అంచనా వేశారు. ఇప్పటికే ఈ మండలంలో గడ్డపోతారం గ్రామాన్ని మున్సిపాలిటీగా చేసిన విషయం విదితమే. తాజాగా జిన్నారంను కూడా మున్సిపాలిటీగా మారుస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి.
జిన్నారం మొత్తం అర్బన్ మండలమే..
జిన్నారం మండలంలో మొత్తం 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన గడ్డపోతారం మున్సిపాలిటీలో ఐదు గ్రామపంచాయతీలను విలీనం చేశారు. ఇప్పుడు మిగిలిన పది గ్రామ పంచాయతీలను కూడా మున్సిపాలిటీగా చేయడంతో ఈ మండలంలో అసలు గ్రామ పంచాయతీలే ఉండవు. దీంతో ఈ మండలం మొత్తం అర్బన్ మండలంగా రూపుదిద్దుకోనుంది. కాగా జిల్లాలో ప్రస్తుతం 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు కాబోతున్న జిన్నారంతో జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య 13కు చేరనుంది.
తీర్మానాలు చేస్తున్న జీపీల స్పెషల్ ఆఫీసర్లు
ఈ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చాలని కోరుతూ ఆయా పంచాయతీలు తీర్మానాలు చేస్తున్నాయి. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేవు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే ఈ గ్రామపంచాయతీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్పెషల్ ఆఫీసర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శులు కలిసి ఈ తీర్మానాలు చేసి కలెక్టరేట్‌కు పంపారు. ఈ తీర్మానాల ఆధారంగా ఈ పది గ్రామాలతో కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారు.
జిల్లాలో మరో కొత్త మున్సిపాలిటీ
ప్రభుత్వానికి కలెక్టరేట్ నుంచి ప్రతిపాదనలు
జిన్నారం, తొమ్మిది గ్రామాలతో కలిపి ఈ మున్సిపాలిటీ ఏర్పాటు